పుట్టింటికి చేరనున్న తొలి మారుతి 800 | Maruti to buy back it's first ever maruti 800 car | Sakshi
Sakshi News home page

పుట్టింటికి చేరనున్న తొలి మారుతి 800

Apr 20 2015 3:35 PM | Updated on Sep 3 2017 12:35 AM

ఇందిరాగాంధీ నుంచి మొట్టమొదటి మారుతి 800 కారు తాళాలను అందుకుంటున్న హర్పాల్ సింగ్.. (ఇన్సెట్లో కారు ప్రస్తుత స్థితి)

ఇందిరాగాంధీ నుంచి మొట్టమొదటి మారుతి 800 కారు తాళాలను అందుకుంటున్న హర్పాల్ సింగ్.. (ఇన్సెట్లో కారు ప్రస్తుత స్థితి)

దక్షిణ ఢిల్లీలో గ్రీన్ పార్క్ రెసిడెన్స్ అనే పేరున్న ఇంటి ముందు.. యజమాని చనిపోయాక ఆదరణ కోల్పోయిన పెంపుడు జంతువులా.. నిర్లక్ష్యానికి గురైన రోగిలా.. 'నన్ను తుక్కుగా అమ్మేస్తారా?' అని ప్రశ్నిస్తున్ననట్లు కనిపిస్తుంది.. భరతదేశపు తొలి మారుతి 800.

దక్షిణ ఢిల్లీలో గ్రీన్ పార్క్ రెసిడెన్స్ అనే పేరున్న ఇంటి ముందు.. యజమాని చనిపోయాక ఆదరణ కోల్పోయిన పెంపుడు జంతువులా.. నిర్లక్ష్యానికి గురైన రోగిలా.. 'నన్ను తుక్కుగా అమ్మేస్తారా?' అని ప్రశ్నిస్తున్ననట్లు కనిపిస్తుంది.. భరతదేశపు మొట్టమొదటి  మారుతి 800 కారు!
                                                 
అది.. డిసెంబర్ 14, 1983.. గుర్గావ్లోని మారుతి కార్ల ఫ్యాక్టరీ.. వేదిక మీద ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఇంకొందరు ప్రముఖులు.. నిర్వాహకులు ఒక పేరు చదివారు.. గడ్డం, తలపాగాతో జనం మధ్యనుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చారు.. ఆ ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది.. దేశ గమనాన్ని తనదైన శైలిలో మార్చేసిన నాలుగు చక్రాల రవాణా సాధనం తాళం చెవులు అందుకున్నందుకు అతని కుటుంబం ఆనందానికి అవధులు లేవు.. అవును! వారు సొంతం చేసుకున్నది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు మరి!

                                      ****                       ****                            ****

తొలి దేశీ తయారీ కారు మారుతి 800 మార్కెట్లోకి వస్తోందన్న ప్రకటన వినగానే అప్పటికి పైలట్గా పనిచేసే హర్పాల్ సింగ్.. తనకున్న ఫియట్ కారును అమ్మేసి మరీ కొత్తకారు కోసం ఎదురుచూశాడు. మొదటి మారుతి 800 కారును సొంతం చేసుకునే అదృష్టవంతుడి కోసం.. బుక్ చేసుకున్న వారందరి పేర్లను చీటీలు వేసి లాటరీ తీశారు. అందులో లక్కీగా హర్పాల్ సింగ్కు తొలి కారు దక్కింది. ఆ కారు హర్పాల్ సింగ్ కుటుంబానికి సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టింది. వేల సంఖ్యలో జనం ఆయన ఇంటికొచ్చికేవలం కారును చూసి వెళ్లేవారు. రోడ్డు మీద అది వెళ్తుంటే.. మారుతీ వైభవాన్ని చూసి ట్రాఫిక్ పోలీసులకు సైతం కళ్లప్పగించి చూసేవారు!! కొన్నేళ్లు గడిచాక మార్కెట్లోకి కొత్తకార్లు చాలా వచ్చాయి. వాస్తవానికి.. మారుతి కంపెనీయే స్వయంగా హర్పాల్ని కలిసి ఆ 800 కారు వదిలేసి జెన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అందుకాయన నిరాకరించాడు. అంతేకాదు.. 2010లో చనిపోయే వరకూ ఆ కారులోనే తన జీవనయానాన్ని కొనసాగించాడు. సింగ్ పోయిన రెండేళ్లకు ఆయన భార్య గుల్షన్ కౌర్ కూడా చనిపోయారు. వాళ్ల కూతుళ్లిద్దరూ ప్రస్తుతం ఢిల్లీలోనే వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. హర్పాల్ నివసించిన ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ ఉండట్లేదు. ఇంటి ముందు మాత్రం మొదటి మారుతీ 800 ఎప్పటిలాగే ఉంది!

                                          ****                       ****                            ****


'ఇంతటి విశిష్ట వాహహనాన్ని అలా వదిలెయ్యడం మాకూ ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం ఆ కారును మేం ఉపయోగించలేం. మారుతీ కంపెనీయే దీన్ని తీసుకొని, మ్యూజియంగానో ఇకెలాగో భద్రపరిస్తే బాగుంటుందనుకుంటున్నాం' అని హర్పాల్  కూతురు, అల్లుడు అంటున్నారు. స్పందించిన మారుతి ఆటోమోటర్స్ సంస్థ ప్రతినిధులు.. 'వారి విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మొట్టమొదటి మారుతి 800 ను సముచితంగా గౌరవించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఆమేరకు చర్యలు చేపడతాం' అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement