breaking news
harpal singh
-
తొలి మారుతిని కొంటానంటున్న మమ్ముట్టి
మొట్టమొదటి మారుతి 800 కారు ఈ మధ్యే మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది యజమాని ఇంటి బయట తుక్కులా పడి ఉన్న విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచారమైంది. ఆ కారును కొనాలని మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి భావిస్తున్నారు. తన మొదటి కారు కూడా మారుతీయేనని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన పలు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. వాటిలో బీఎండబ్ల్యులు, జాగ్వార్ కార్లు కూడా ఉన్నాయి. అయినా కూడా దేశంలో ఉత్పత్తి అయిన మొట్టమొదటి మారుతి కారు కావడంతో దాన్ని కొనాలని ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే మమ్ముట్టితో పాటు మరికొందరు కూడా ఈ కారును కొనాలని ఉత్సాహం చూపిస్తున్నారు. హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం యజమాని, ప్రముఖ క్విజ్ మాస్టర్ డెరిక్ ఓబ్రెయిన్, ఇంకొంతమంది కూడా ఈ కారుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కారు యజమాని అయిన హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం.. కారును కంపెనీకే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. 32 ఏళ్ల క్రితం లక్కీడ్రాలో ఈ మొట్టమొదటి మారుతి కారు ఆయనకు దక్కింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆయనకు ఈ కారు తాళాలు అందించారు. -
పుట్టింటికి చేరనున్న తొలి మారుతి 800
దక్షిణ ఢిల్లీలో గ్రీన్ పార్క్ రెసిడెన్స్ అనే పేరున్న ఇంటి ముందు.. యజమాని చనిపోయాక ఆదరణ కోల్పోయిన పెంపుడు జంతువులా.. నిర్లక్ష్యానికి గురైన రోగిలా.. 'నన్ను తుక్కుగా అమ్మేస్తారా?' అని ప్రశ్నిస్తున్ననట్లు కనిపిస్తుంది.. భరతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు! అది.. డిసెంబర్ 14, 1983.. గుర్గావ్లోని మారుతి కార్ల ఫ్యాక్టరీ.. వేదిక మీద ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఇంకొందరు ప్రముఖులు.. నిర్వాహకులు ఒక పేరు చదివారు.. గడ్డం, తలపాగాతో జనం మధ్యనుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చారు.. ఆ ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది.. దేశ గమనాన్ని తనదైన శైలిలో మార్చేసిన నాలుగు చక్రాల రవాణా సాధనం తాళం చెవులు అందుకున్నందుకు అతని కుటుంబం ఆనందానికి అవధులు లేవు.. అవును! వారు సొంతం చేసుకున్నది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు మరి! **** **** **** తొలి దేశీ తయారీ కారు మారుతి 800 మార్కెట్లోకి వస్తోందన్న ప్రకటన వినగానే అప్పటికి పైలట్‌గా పనిచేసే హర్పాల్ సింగ్.. తనకున్న ఫియట్ కారును అమ్మేసి మరీ కొత్తకారు కోసం ఎదురుచూశాడు. మొదటి మారుతి 800 కారును సొంతం చేసుకునే అదృష్టవంతుడి కోసం.. బుక్ చేసుకున్న వారందరి పేర్లను చీటీలు వేసి లాటరీ తీశారు. అందులో లక్కీగా హర్పాల్ సింగ్‌కు తొలి కారు దక్కింది. ఆ కారు హర్పాల్ సింగ్ కుటుంబానికి సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టింది. వేల సంఖ్యలో జనం ఆయన ఇంటికొచ్చికేవలం కారును చూసి వెళ్లేవారు. రోడ్డు మీద అది వెళ్తుంటే.. మారుతీ వైభవాన్ని చూసి ట్రాఫిక్ పోలీసులకు సైతం కళ్లప్పగించి చూసేవారు!! కొన్నేళ్లు గడిచాక మార్కెట్లోకి కొత్తకార్లు చాలా వచ్చాయి. వాస్తవానికి.. మారుతి కంపెనీయే స్వయంగా హర్పాల్ని కలిసి ఆ 800 కారు వదిలేసి జెన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అందుకాయన నిరాకరించాడు. అంతేకాదు.. 2010లో చనిపోయే వరకూ ఆ కారులోనే తన జీవనయానాన్ని కొనసాగించాడు. సింగ్ పోయిన రెండేళ్లకు ఆయన భార్య గుల్షన్ కౌర్ కూడా చనిపోయారు. వాళ్ల కూతుళ్లిద్దరూ ప్రస్తుతం ఢిల్లీలోనే వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. హర్పాల్ నివసించిన ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ ఉండట్లేదు. ఇంటి ముందు మాత్రం మొదటి మారుతీ 800 ఎప్పటిలాగే ఉంది! **** **** **** 'ఇంతటి విశిష్ట వాహహనాన్ని అలా వదిలెయ్యడం మాకూ ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం ఆ కారును మేం ఉపయోగించలేం. మారుతీ కంపెనీయే దీన్ని తీసుకొని, మ్యూజియంగానో ఇకెలాగో భద్రపరిస్తే బాగుంటుందనుకుంటున్నాం' అని హర్పాల్ కూతురు, అల్లుడు అంటున్నారు. స్పందించిన మారుతి ఆటోమోటర్స్ సంస్థ ప్రతినిధులు.. 'వారి విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మొట్టమొదటి మారుతి 800 ను సముచితంగా గౌరవించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఆమేరకు చర్యలు చేపడతాం' అంటున్నారు.