
అరెస్టు చేస్తారా? లేదా?
బ్రిటన్‌లో ఎమర్జెన్సీ సర్వీసుకు 999 నంబరును ఉపయోగిస్తారు.
బ్రిటన్‌లో ఎమర్జెన్సీ సర్వీసుకు 999 నంబరును ఉపయోగిస్తారు. వెస్ట్‌యార్క్‌షైర్ పోలీసులకు ఈ నంబరుపై ఒకతను ఫోన్ చేశాడు. సర్... మీరు అర్జంటుగా నా గర్ల్ ఫ్రెండ్‌ను, ఆమె పెంపుడు పిల్లిని అరెస్టు చేయాలని కోరాడు. ఎందుకు అరెస్టు చేయాలంటున్నారని కంట్రోల్ రూములో ఫోన్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తి అడగ్గా... ‘దొంగపిల్లి, నా బకాన్ (పందిమాంసం ముక్కలు) తినేసింది’ అని ఫిర్యాదు చేశాడా మహానుభావుడు. వింటున్న వ్యక్తి నోరెళ్లబెట్టాడు. కాసేపటికి తేరుకొని కుదరదన్నాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఊరుకుంటేనా! లేదు... చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బెట్టుచేశాడు.
పిల్లి మాంసం ముక్కలు తినడం చట్ట ఉల్లంఘన కాదని అతనికి సర్దిచెప్పేసరికి కంట్రోల్ రూము సిబ్బందికి తలప్రాణం తోకలోకి వచ్చిందట. ఇలాంటి తిక్కతిక్క కాల్స్ చేసి తమ విలువైన సమయాన్ని వృథా చేయవద్దని కోరుతూ యార్క్‌షైర్ పోలీసులు ఈ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్పును విడుదల చేశారు.