ఈ సందర్భంగా సీఎం నితీశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం.
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. గురుగోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా పట్నాలో నిర్వహించిన ప్రకాశ్ పర్వ వేడుకల్లో సీఎం నితీశ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. గాంధీ మైదానంలో తాత్కాలిక గురుద్వారను ఏర్పాటుచేసి ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ కూటమి బీజేపీ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ, నితీశ్ ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు తర్వాత బిహార్‌కు మోదీ తొలిసారి వచ్చారు. నోట్లరద్దును విపక్షాలు వ్యతిరేకిస్తున్నా సీఎం నితీశ్ బాహాటంగా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే.
ఈ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గురుగోవింద్ సింగ్ సేవలను కొనియాడారు. గురుగోవింద్‌సింగ్, కర్పూరి ఠాకూర్, జయప్రకాశ్ నారాయణ్ వంటి యోధులను బిహార్ గడ్డ అందించిందని, దేశాన్ని ముందుకు నడిపించడంలో బిహార్ ఎప్పుడు అండగా నిలబడుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం. ప్రకాశ్ పర్వ్ వేడుకల కోసం నితీశ్ ఘనంగా ఏర్పాట్లు చేయడాన్ని మోదీ కొనియాడారు.