టీడీపీ కార్యాలయానికి అక్రమ పునాది! | land occupied for TDP office in guntur | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయానికి అక్రమ పునాది!

Aug 10 2015 10:38 AM | Updated on Aug 24 2018 2:36 PM

టీడీపీ కార్యాలయానికి అక్రమ పునాది! - Sakshi

టీడీపీ కార్యాలయానికి అక్రమ పునాది!

అధికార పార్టీ టీడీపీ వ్యవహారశైలి కంచే చేను మేసిన చందంగా తయారైంది.

 గుంటూరులో వెయ్యి గజాలు లీజుకు తీసుకుని మరో 1,637 గజాలు ఆక్రమణ
 ఆక్రమణ భూమిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి సన్నాహాలు

 
 మైకు దొరికితే నీతి, నిజాయతీ గురించి మాట్లాడే చంద్రబాబు.. తాను అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు అక్రమ పునాదులు వేస్తున్నారు. చేతిలో అధికారం ఉందికదా అనే ధీమాతో ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 సాక్షి, గుంటూరు:  అధికార పార్టీ టీడీపీ వ్యవహారశైలి కంచే చేను మేసిన చందంగా తయారైంది. గుంటూరులో ఆ పార్టీ 16 ఏళ్ల క్రితం కబ్జా చేసిన కార్పొరేషన్ స్థలంలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న స్థలంతోపాటు చుట్టు పక్కల స్థలాలపైనా కన్నేసింది. గతంలో అధికారంలో ఉన్నపుడు 1999లో గుంటూరులోనే ఖరీదైన ప్రాంతం అరండల్‌పేట పిచుకులగుంటలో జిల్లా టీడీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. దీనికోసం టీఎస్ నంబరు 826లో వెయ్యి చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న జీవో ఎంఎస్ నం. 325 ద్వారా 30 ఏళ్లపాటు ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఏడాదికి రూ. 25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తూ, ప్రతి మూడేళ్లకొకసారి లీజును రెన్యువల్‌తో పాటు 33 శాతం అద్దె పెంచాలని అందులో పేర్కొంది. అయితే లీజు స్థలం పక్కనే సర్వే నం 12/3లో మరో 1,637 చదరపు గజాల  స్థలాన్ని సైతం ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క చదరపు గజం స్థలం రూ.1.25 లక్షల వర కు ధర పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే మొత్తం స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లు. అప్పట్లోనే ఈ ఆక్రమణను నగరపాలకసంస్థ గుర్తించినప్పటికీ టీడీపీ అధికారంలో ఉండటంతో దాని జోలికెళ్లలేదు. 2008లో తిరిగి దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో నగరపాలక సంస్థ అధికారులు కదిలారు. సిటీప్లానర్ విచారణ జరిపి ఆక్రమణ జరిగినట్లు తేల్చారు. ఆయన నివేదిక ఆధారంగా టీడీపీ జిల్లా కార్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకున్నారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగరపాలకసంస్థ అధికారులకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ఏడాదికి ప్రస్తుతం రూ. 89,881 చెల్లిస్తున్నారు. 16 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలో ఉన్న 1,637 గజాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతోనే రుసుము  చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. లీజుకు తీసుకున్న స్థలం ప్రకారం చూసినా ఆక్రమించిన స్థలానికి సంబంధించి కార్పొరేషన్ దాదాపు పన్నెండున్నర లక్షల ఆదాయం కోల్పోయింది.
 
 లోకేశ్ కనుసన్నల్లో సన్నాహాలు..
 
  రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణ ప్రాంతం గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత తనయుడు లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దాని కోసం స్థల పరిశీలనకు కొద్ది రోజుల క్రితం ఆయన గుంటూరుకు రావాల్సి ఉన్నా.. రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట ఘటనతో  పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేయించిన సిద్ధాంతి సైతం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించి కొలతలు తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైతే ఆ పార్టీ ఆక్రమించిన స్థలం సైతం పూర్తిగా వారి అధీనంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement