నాలుగు రోజుల దూకుడు తరువాత స్టాక్ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ మొదలైన తొలి అర్ధగంటలోనే సెన్సెక్స్
మార్కెట్లు... ఎక్కడివక్కడే
Sep 12 2013 3:42 AM | Updated on Sep 1 2017 10:37 PM
నాలుగు రోజుల దూకుడు తరువాత స్టాక్ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ మొదలైన తొలి అర్ధగంటలోనే సెన్సెక్స్ గరిష్టంగా 20,055 పాయింట్లను తాకింది. ఆపై పెరుగుతూ వచ్చిన అమ్మకాలతో మిడ్ సెషన్‌లో కనిష్టంగా 19,777 పాయింట్లకు చేరింది. గరిష్టస్థాయి నుంచి దాదాపు 280 పాయింట్ల తిరోగమనమిది! అయితే చివరి అర్ధగంటలో కొనుగోళ్లు పుంజుకోవడంతో మరోసారి 20,028 పాయింట్లకు ఎగసింది. ఆపై మళ్లీ అమ్మకాలు పెరగడంతో లాభాలను పోగొట్టుకుంది.
వెరసి చివరికి యథాతథంగా 19,997 వద్దే సెన్సెక్స్ నిలిచింది. ఇదేబాటలో ఒడిదొడుకులను చవిచూసిన నిఫ్టీ మాత్రం ముగింపులో 16 పాయింట్లు లాభపడి 5,913 వద్ద స్థిర పడింది. కాగా, మంగళవారం సెన్సెక్స్ గత నాలుగేళ్లలో లేని విధంగా 727 పాయింట్లు జంప్ చేసిన విషయం విదితమే. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, సిరియా ఆందోళనలు ఉపశమించడం వంటి అంశాలు సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు వరుసగా నాలుగు రోజులు దూసుకెళ్లిన మార్కెట్లలో ఆపరేటర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పాల్పడటంతో ఇండెక్స్‌లు ఒడిదొడుకులకు లోనయ్యాయని వివరించారు.
బ్యాంకింగ్ దూకుడు : ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రాజన్ ప్రమాణం చేసినప్పటినుంచీ జోరందుకున్న బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ బుధవారం కూడా కొనసాగింది. బీవోఐ, బీవోబీ, యూనియన్, పీఎన్‌బీ, కెనరా, ఫెడరల్, ఎస్‌బీఐ, యాక్సిస్, ఇండస్‌ఇండ్ 10.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో బ్యాంకెక్స్ 2% లాభపడింది. ఇక మెటల్, రియల్టీ రంగాలు 3% స్థాయిలో పురోగమించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా స్టీల్ 5%, హిందాల్కో 4% చొప్పున జంప్‌చేయగా, టాటా పవర్, సన్ ఫార్మా 2.5% స్థాయిలో బలపడ్డాయి. ఇక రియల్టీ షేర్లలో డీఎల్‌ఎఫ్ 5% పుంజుకోగా, హెచ్‌డీఐఎల్ 3.6%, ఇండియాబుల్స్ 2.6% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, భెల్ 2.5-1.5% మధ్య నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐల జోరు: ముందురోజు రూ. 2,564 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 586 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 386 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,419 బలపడగా, 940 నష్టపోయాయి.
Advertisement
Advertisement