రైల్వే శాఖలో చాలా సంస్కరణలు చేపట్టాల్సి ఉందని, ఇది కష్టమే అయినా.. తప్పనిసరిగా చేపట్టాలని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు.
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో చాలా సంస్కరణలు చేపట్టాల్సి ఉందని, ఇది కష్టమే అయినా.. తప్పనిసరిగా చేపట్టాలని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. 2014-15 రైల్వే బడ్జెట్ ను మంగళవారం లోక్సభలో ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంస్కరణల గురించి మాట్లాడుతూ... ''మందు చేదుగానే ఉంటుంది గానీ, చివరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది''. కేవలం ప్రయాణికుల ఛార్జీలను పెండచం మాత్రమే నిధుల సేకరణకు మార్గం కాదన్నారు. ప్రత్యామ్నాయ వనరులను కూడా అన్వేషించాలని అభిలషించారు.
రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయడం, స్వదేశీ, విదేశీ నిధులను తేవడం.. ఇవన్నీ తమ ముందున్న మార్గాలని చెప్పారు. రైల్వే ఆపరేషన్లు మినహా మిగిలిన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లను తేవడానికి కేబినేట్ ఆమోదం కోరామన్నారు. పీపీపీ మార్గంలో కూడా కొన్ని పనులను చేపడతామన్నారు. హైస్పీడ్ రైలు లాంటి వాటికోసం దీన్ని ఉపయోగిస్తామని సదానంద గౌడ తెలిపారు.