15వ కాన్పులో అబ్బాయి..!

15వ కాన్పులో అబ్బాయి..!


అయినా సంతృప్తి పడని గుజరాతీ జంట

16వ సారి గర్భం ధరించిన కానూ సంగోద్


 

 వడోదర: పుత్రసంతానం కోసం తపించి పోయే భారతీయ దంపతుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. తమకు మగపిల్లాడు పుట్టాలనే కోరికతో పూజలు చేస్తూ, మొక్కుబడులు పెట్టుకునే వాళ్ల దగ్గర నుంచి ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యకు పాల్పడే వాళ్లు, పుట్టాకా పసిపాపను వదిలించుకునే వాళ్లు కూడా అనునిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మరి అలాంటి వారికి భిన్నంగా పుత్ర సంతానం తపనలో ఏకంగా 14 కాన్పుల్లో 14 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఈ గుజరాతీ మహిళ. పిల్లాడు పుట్టే వరకూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరించిన ఆ భార్యాభర్తల పేర్లు కానూ సంగోద్, రామ్‌సిన్హా. గుజరాత్‌లోని ఝరీభుజ్హీ అనే ఒక మారుమూల గ్రామానికి చెందిన వీళ్ల కథ ఆసక్తికరంగా ఉంది. 20 యేళ్ల కిందట వీళ్ల వివాహం జరిగింది.అప్పటి నుంచి వీళ్ల తపన, ఇంట్లో వాళ్ల కోరిక ఒకటే... తొలి కాన్పులోనే అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. అయితే అది జరగక పాప పుట్టింది. తనకు సారంగన అని పేరు పెట్టుకున్నారు. రెండోసారి అయినా బాబు అనుకుంటే.. మళ్లీ పాప. అయినా వీళ్లు రాజీపడలేదు. అలా ఒకసారి కాదు. ఆ తర్వాత పన్నెండు సార్లు కానూ గర్భం దాలిస్తే ప్రతిసారీ అమ్మాయే పుట్టింది. ‘చివరకు దేవుడు మా ప్రార్థనను ఆలకించాడు...’ 15 వ ప్రసవం తర్వాత  కానూ, రామ్ దంపతుల మాట ఇది. రెండేళ్ల క్రితం కానూ ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ విజయానికి గుర్తుగా వారు తనకు ‘విజయ్’ అని పేరు పెట్టుకుని మురిసిపోయారు.అయితే సంతృప్తి మాత్రం లేదు. మరో అబ్బాయి పుడితే బాగుంటుందనే కోరిక... కానూ ఇప్పుడు మళ్లీ గర్భవతి. ఈసారి మరో అబ్బాయి పుడతాడు అనే ఆశాభావంతో ఉన్నారు ఆ దంపతులు. కుటుంబ నియంత్రణ అనేదాన్ని ఏ మాత్రం ఖాతరు చేయని ఈ దంపతుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తమ 14 మంది అమ్మాయిల్లో ఐదుమందినే వీళ్లు స్కూల్‌కు పంపుతున్నారు, మిగిలిన వాళ్లు వ్యవసాయపనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. తాము గిరిజన జాతికి చెందిన వాళ్లం అని.. తమ కుటుంబాల్లో అబార్షన్ నిషిద్ధమని దీంతో అబ్బాయి కోసం తపనలో ఇలా జరిగిపోయిందని కానూ దంపతులు చెబుతున్నారు. అయితే కుటుంబ పోషణ చాలా భారమైందని కూడా పెద్దకుటుంబంతో ఉండే బాధలను ఏకరువు పెడుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top