అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం

Published Mon, Jan 16 2017 1:48 PM

i will contest against akhilesh yadav, says mulayam

ఇప్పటివరకు మాటలకే పరిమితమైన ములాయం - అఖిలేష్ పోరు ఇక నేరుగా ఎన్నికల బరిలోకి తలపడే వరకు వెళ్లింది. అవసరమైతే స్వయంగా తానే అసెంబ్లీ ఎన్నికల బరిలో తన కొడుకు అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ ముస్లింలను సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ఎవరికి చెందాలనే విషయం గురించి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని సోమవారమే వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ములాయం తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. 
 
తాను పార్టీని, సైకిల్ గుర్తును కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నానని.. అఖిలేష్ తన మాటలు వినిపించుకోకపోతే తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ములాయం స్పష్టం చేశారు. తాను మూడుసార్లు అఖిలేష్‌ను పిలిచానని, కానీ అతడు ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి, తాను మాట్లాడటం మొదలుపెట్టడానికి ముందే అక్కడినుంచి వెళ్లిపోయాడని అన్నారు. సైకిల్ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తామని చెప్పారు.  బీజేపీ, ఇతర ప్రతిపక్షాలతో అఖిలేష్ చేతులు కలిపాడని, అతడికి నచ్చజెప్పడానికి తాను ఎంత ప్రయత్నించినా తన తప్పులు తెలుసుకోవడం లేదని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అఖిలేష్‌కు వ్యతిరేకంగా ప్రజల సాయం కోరుతానని తెలిపారు. 
 
ఆ వ్యాఖ్యలు ఎందుకు? 
కాంగ్రెస్, ఆర్ఎల్‌డీ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాలని అఖిలేష్ వర్గం భావిస్తుండగా.. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించడం ద్వారా ఆ వర్గానికి ముస్లిం ఓట్లను దూరం చేసేందుకు ములాయం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా 19 శాతం వరకు ఉంది. ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీకి వాళ్ల మద్దతు గట్టిగా ఉండేది. చివరకు ములాయంను 'మౌలానా ములాయం' అని కూడా అనేవారు. అలాంటి భారీ మద్దతును కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే అఖిలేష్‌ వర్గంపై 'బీజేపీ అనుకూల' రంగు పులిమేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం. 

Advertisement
Advertisement