ఐన్‌స్టీన్ ‘తరంగాలు’ దొరికాయి | Sakshi
Sakshi News home page

ఐన్‌స్టీన్ ‘తరంగాలు’ దొరికాయి

Published Fri, Feb 12 2016 7:04 AM

ఐన్‌స్టీన్ ‘తరంగాలు’ దొరికాయి

గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన ‘లిగో’ శాస్త్రవేత్తలు
* 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న కృష్ణబిలాల నుంచి వచ్చిన తరంగాలు

వాషింగ్టన్: మానవ చరిత్రలో మరో అద్భుతమైన ఆవిష్కరణ చోటుచేసుకుంది. విశ్వం పుట్టుకనాటి రహస్యాలను తెలుసుకొనగలిగే పరిశోధనకు బీజం పడింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి..

అంతరిక్షంలోకి విస్తరిస్తున్న ఈ తరంగాల ఉనికిని నిర్ధారించుకున్నట్లు యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కార్డోవా వెల్లడించారు. ఇప్పటివరకూ గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని.. కానీ ఆధారపూర్వకంగా తొలిసారిగా గుర్తించామని తెలిపారు. దీనిద్వారా విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవచ్చని చెప్పారు.

1916లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా లెక్కించగలిగిన గురుత్వాకర్షణ తరంగాలు.. తాము గుర్తించిన తరంగాలు కచ్చితంగా సరిపోలాయని ‘లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ షూమాకర్ చెప్పారు.

బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను.. కృష్ణబిలాలను దీని ద్వారా పరిశోధించవచ్చని తెలిపారు. కాగా ఈ పరిశోధనలో పాలుపంచుకున్న భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ అభినందించారు. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం గొప్ప ముందడుగని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
ఏమిటీ పరిశోధన..?
నక్షత్రాలకు, కృష్ణ బిలాలకు గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు, కృష్ణబిలాలు ఢీకొన్నప్పుడుగానీ, పేలినప్పుడుగానీ గురుత్వాకర్షణ తరంగాలు వెలువడతాయని అంచనా. అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే అతి భారీ ద్రవ్యరాశుల గమనాన్ని వీటి ద్వారా నిర్ధారించవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలను ఏదీ అడ్డుకోలేదు. నీటిలో రాయి వేసినప్పుడు ఏర్పడే అలల్లా ఇవి విస్తరిస్తాయని అంచనా.

ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’ పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్లను హాన్‌ఫోర్డ్, లివింగ్‌స్టన్ ప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించారు. వీటి సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి. అవి ఢీకొన్నప్పుడు వెలువడి స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి.

ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.21 గంటలకు) ‘లిగో’లోని పరికరాలు గురుత్వాకర్షణ తరంగాలకు తొలి ఆధారాన్ని సంపాదించాయి. తొలుత లివింగ్‌స్టన్‌లో ఉన్న డిటెక్టర్ ఈ తరంగాలను గుర్తించింది. అక్కడికి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హాన్‌ఫోర్డ్‌లోని డిటెక్టర్ 7.1 మిల్లీ సెకన్ల తర్వాత గుర్తించింది.

ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో నమోదైంది కూడా.  అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు 5 నెలల సమయం పట్టింది. అయితే ఈ గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన పరోక్ష ఆధారాలను 1974లోనే ఓ న్యూట్రాన్ నక్షత్రంపై పరిశోధన చేసినప్పుడు గుర్తించారు.

Advertisement
Advertisement