
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒకేసారి పంట రుణాలు మాఫీ చేయకుండా విడతల వారీగా చేయడమే రైతుల ఆత్మహత్యలకు కారణమని వైఎస్సాఆర్ సీపీ భావిస్తోందన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు.
వరంగల్ జిల్లాలో షర్మిల రెండోదశ పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం ఇసిపేటలో శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను చూసిన వైఎస్‌ఆర్ ఉచిత కరెంటు ఇచ్చారని, కనీస మద్దతు ధర పెరి గేలా చేశారని, నష్టపరిహారాన్ని పెంచారన్నారు. వీటితోపాటు రుణాలు మాఫీ చేయడంతో వైఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
2 దశల్లో 10 రోజుల్లో కలిపి వరంగల్ జిల్లాలో ఇప్పటికి 62 కుటుంబాలను షర్మిల పరామర్శించినట్లు తెలిపారు. ఈ యాత్రలో ఆరడుగులు లేని ఇళ్లలో ఉంటున్నవారిని కలసినట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ ఉంటే పేదలందరికీ పక్కా ఇళ్లు ఉండేవన్నారు. ఈ విషయాన్ని పేదలే చెబుతున్నారన్నారు. వరంగల్ జిల్లాలో మిగిలిన 11 కుటుంబాలను పరామర్శించేందుకు సెప్టెం బర్ 21, 22 తేదీల్లో మూడోదశ యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న వరంగల్‌లో ముగిసి, కరీంనగర్ జిల్లాలో మొదలవుతుందన్నారు.