
చర్యలంటే కాంగ్రెస్ ఖాళీ: గంటా శ్రీనివాసరావు
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ మిగలరని పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
బొత్స వ్యాఖ్యలపై మంత్రి గంటా ఘాటు స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ మిగలరని పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిం చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు ఎవరిపై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని ఎలా ఉపసంహరింపజేయాలో ఆలోచించాలి గానీ విమర్శించిన వారందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పోతే పార్టీలో ఒక్కరూ మిగలరని వ్యాఖ్యానించారు.
పక్క పార్టీల్లో కండువాలు వేసుకున్న వారే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారన్న బొత్స వ్యాఖ్యలపై గంటా స్పందిస్తూ... ఇప్పుడు వ్యక్తులు కాదు ఏకంగా పార్టీలే పక్క పార్టీల కండువాలు వేసుకుంటున్నాయని, దాని గురించి ఆలోచించాలని హితవు పలికారు. పెండింగ్ పరిశ్రమలు, ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారని, కాకినాడ ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ ప్రాజెక్టు కోసం జేడీఎఫ్, షెల్ కంపెనీలు పోటీపడుతున్నందున వాటి సంయుక్త భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాకినాడ-విశాఖ పెట్రో కారిడార్ ప్రాజెక్టు అడ్డంకులన్నీ తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం సూచించారన్నారు.
కాకినాడ, గంగవరం పోర్టుల అభివృద్ధి వల్ల ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఏటా రూ. 5,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మచిలీపట్నం పోర్టు విస్తరణకు భూసేకరణనూ వెంటనే మొదలుపెట్టాలని, చిత్తూరు తాగునీటి పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. చిత్తూరు తాగునీటి పథకంపై టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ప్రజలకు తాగునీటి కల్పన ప్రభుత్వం ప్రధాన బాధ్యతని, క్రమంగా అన్ని జిల్లాల్లోనూ ఆ పథకం అమలు చేస్తామని వివరించారు.