వితంతువుకే పూర్తి హక్కులు
హిందూ వితంతువు జీవనానికి అవసరమయ్యే డబ్బు, ఆస్తి కేవలం లాంఛనంగా ఇచ్చేది కాదని, అది ఆమెకు నైతికంగా లభించే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది
భర్త ఇచ్చిన ఆస్తిపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: హిందూ వితంతువు జీవనానికి అవసరమయ్యే డబ్బు, ఆస్తి కేవలం లాంఛనంగా ఇచ్చేది కాదని, అది ఆమెకు నైతికంగా లభించే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆమె జీవనం కోసం భర్త నుంచి లభించే ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని, దీనికి చట్టపరమైన రక్షణ కూడా ఉంటుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ వితంతువుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వితంతువుకు భర్తనుంచి లభించిన ఆస్తిని అవసరమైతే ఇతరులకు బదలాయించడానికి పూర్తి హక్కులు ఉంటాయని తెలిపింది.
భార్యను సంరక్షించే బాధ్యత భర్తదేనని, హిందూ సంప్రదాయాలు, చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. హిందూ వితంతువు జీవించేందుకు ఇచ్చే డబ్బు దయ, జాలితోనే ఇచ్చేది కాదని, అది గౌరవపూర్వకంగా, నైతికంగా ఆమెకు హక్కుగా లభించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఆమె హక్కును ఎవరైనా కాదంటే కోర్టుద్వారా దానిని సంపాదించుకోవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది.


