breaking news
Hindu widow
-
మామ ఆస్తి నుంచి వితంతువుకు భరణం
న్యూఢిల్లీ: మామ మరణం తర్వాత ఆయన ఆస్తి నుంచి భరణం పొందే హక్కు హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్ఏఎంఏ)–1956 ప్రకారం వితంతువుకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టి ధర్మాసనం మంగళవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు మహిళ భర్త ఆమె మామగారి కంటే ముందు మరణించాడా, లేదా తర్వాతా అనేదానితో ఇందుకు నిమిత్తం లేదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘చట్టప్రకారం ఇంట్లోని డిపెండెంట్స్ అందరి పోషణ బాధ్యతా మరణించిన వారి వారసులపై ఉంటుంది. మృతుని నుంచి సంక్రమించిన ఆస్తుల నుంచే వారిని పోషించాల్సి ఉంటుంది. హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్ఏఎంఏ)–1956లోని సెక్షన్ 21 (7) ప్రకారం మృతుని వితంతు కోడలు డిపెండెంటే అవుతుంది. ఆ ప్రకారం 22వ సెక్షన్ కింద ఆమె మెయింటెనెన్స్కు హక్కుదారే అవుతారు’’అని తీర్పు రాసిన జస్టిస్ మిత్తల్ స్పష్టం చేశారు. ‘‘కుమారుడు మరణిస్తే కోడలి పోషణ మామగారి ధారి్మక విధి. స్వయంగా లేదా మరణించిన భర్త వదిలి వెళ్లిన ఆస్తి ద్వారా ఆమె తన పోషణ బాధ్యతలు చేసుకోలేనప్పుడు ఇది మరింతగా వర్తిస్తుంది’’అని పేర్కొన్నారు. మహేంద్రప్రసాద్ అనే వ్యక్తి 2021 డిసెంబర్లో మరణించాడు. తర్వాత రెండేళ్లకు ఆయన కుమారుడు రంజిత్ శర్మ మరణించగా మామగారి ఆస్తి నుంచి మెయింటెనెన్స్ కోరుతూ ఆయన భార్య గీత ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. మామ మరణించినప్పుడు గీత వితంతువు కాదంటూ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో అత్తింటివారు దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువర్చింది. -
వితంతువుకే పూర్తి హక్కులు
భర్త ఇచ్చిన ఆస్తిపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: హిందూ వితంతువు జీవనానికి అవసరమయ్యే డబ్బు, ఆస్తి కేవలం లాంఛనంగా ఇచ్చేది కాదని, అది ఆమెకు నైతికంగా లభించే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆమె జీవనం కోసం భర్త నుంచి లభించే ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని, దీనికి చట్టపరమైన రక్షణ కూడా ఉంటుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ వితంతువుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వితంతువుకు భర్తనుంచి లభించిన ఆస్తిని అవసరమైతే ఇతరులకు బదలాయించడానికి పూర్తి హక్కులు ఉంటాయని తెలిపింది. భార్యను సంరక్షించే బాధ్యత భర్తదేనని, హిందూ సంప్రదాయాలు, చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. హిందూ వితంతువు జీవించేందుకు ఇచ్చే డబ్బు దయ, జాలితోనే ఇచ్చేది కాదని, అది గౌరవపూర్వకంగా, నైతికంగా ఆమెకు హక్కుగా లభించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఆమె హక్కును ఎవరైనా కాదంటే కోర్టుద్వారా దానిని సంపాదించుకోవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది.


