
ఆర్థిక పరిస్థితిపై ఫిచ్ సంతృప్తి: కేంద్రం
దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రేటింగ్ సంస్థ ఫిచ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారామ్ పేర్కొన్నారు
న్యూఢిల్లీ: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రేటింగ్ సంస్థ ఫిచ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారామ్ పేర్కొన్నారు. అంతకుముందు ఫిచ్ ప్రతినిధులు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మయారామ్ విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల మొండి బకాయిల భారం పెరుగుతుండడం పట్ల వారు ఆందోళన వెలిబుచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు వివరించారు. కాగా ప్రభుత్వ ఆదాయం, వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి ద్రవ్యలోటు పెరిగిపోవడం పట్ల కూడా ఫిచ్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్ ‘స్టేబుల్ ఔట్‌లుక్’ ఉంది.