
బ్రిటన్ తరహాలో ఢిల్లీలోనూ..
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ రిఫరెండమ్లో తీర్పు రావడాన్ని ప్రేరణగా తీసుకుని.. ఢిల్లీలోనూ రిఫరెండమ్ నిర్వహించనున్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ రిఫరెండమ్లో తీర్పు రావడాన్ని ప్రేరణగా తీసుకుని.. ఢిల్లీలోనూ రిఫరెండమ్ నిర్వహించనున్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా ఇవ్వాలనే డిమాండ్తో త్వరలో రిఫరెండమ్ నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. బ్రిటన్ రిఫరెండమ్ తీర్పు వచ్చిన కాసేపటికి కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
తొలుత కేంద్ర పాలిత కేంద్రంగా ఉన్న ఢిల్లీకి.. తర్వాత పరిమిత అధికారాలతో రాష్ట్ర హోదా ఇచ్చారు. అయితే పోలీసులు, ఏసీబీ సహా శాంతిభద్రతల విభాగం కేంద్రం పరిధిలోనే ఉంది. దీనిపై కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా ఇవ్వాలంటూ పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రంతో ఘర్షణ వైఖరి కూడా అవలంభించారు. తాజాగా బ్రిటన్లో నిర్వహించిన బ్రెగ్జిట్లో యూరోపియన్ యూనియన్ నుంచి ఆ దేశం బయటకు రావాలని ప్రజలు తీర్పు ఇచ్చాకా, ఢిల్లీలో రిఫరెండమ్ నిర్వహించనున్నట్టు కేజ‍్రీవాల్ తెలిపారు.
యూరప్ దేశాల్లో రిఫరెండమ్ (ప్రజాభిప్రాయసేకరణ) నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజల తీర్పే చెల్లుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రిఫరెండమ్ నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఢిల్లీకి పూర్తిస్థాయి హోదా ఇవ్వాలని మెజార్టీ ప్రజలు కోరుకున్నా.. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని భారత రాజ్యాంగంలో లేదు.
After UK referendum, delhi will soon have a referendum on full statehood
— Arvind Kejriwal (@ArvindKejriwal) 24 June 2016