
'అక్రమాలు నిజమే... జైట్లీకి సంబంధం లేదు'
నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఒప్పుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)పై వచ్చిన నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ క్రికెటర్, బీజేపీ కీర్తి ఆజాద్ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డీడీసీఏ పలు మోసపూరిత కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని, ఎటువంటి సంప్రదింపులు లేకుండానే డబ్బులు చెల్లించిందని ఆరోపించారు.
డీడీసీఏ సభ్యులు టెండర్లలో అక్రమాలు చేశారని చెప్పారు. ల్యాప్ టాప్, ప్రింటర్లు తదితర వస్తుసామాగ్రిని అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై వికీలీక్స్ తయారుచేసిన వీడియోను ఆయనీ సందర్భంగా ప్రదర్శించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని... అవినీతిపైనే తాము పోరాటం చేస్తున్నామని, వ్యక్తులపై కాదని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు.
అక్రమాలకు సంబంధించిన వీడియో బయటపెట్టడంతో నిధుల దుర్వినియోగం జరిగినట్టు డీడీసీఏ ఒప్పుకుంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.