లంచగొండుల చేతులు నరికేయండి: ఎమ్మెల్యే
లంచాలు తీసుకునేవాళ్ల చేతులు నరికి పారేయాలని గోవా ఎమ్మెల్యే నరేష్ సావల్ అన్నారు.
లంచాలు తీసుకునేవాళ్ల చేతులు నరికి పారేయాలని గోవా ఎమ్మెల్యే నరేష్ సావల్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగానే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిజంగానే అవినీతిని అరికట్టే విషయంలో నిజాయితీగా ఉంటే లంచగొండుల చేతులు నరికేయాలని బిచోలిమ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే నరేష్ సావల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం లంచాలను అరికట్టే విషయంలో చాలా నిదానంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే, అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలని సావల్‌కు ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సూచించారు. ఎమ్మెల్యే తన కత్తితో సహా వచ్చినట్లు కనిపిస్తోందని, కానీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి నేరం చేసినట్లు లేదా మోసం చేసినట్లు రుజువైనా కూడా అలా చేయలేమని ఆయన అన్నారు. దొంగల చేతులు నరకలేమని.. మనది ప్రజాస్వామ్య దేశం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పర్సేకర్ కాస్త ఘాటుగానే చెప్పారు. అవినీతిని అరికట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తెలిపారు.


