పంటల బీమా గోవిందా! | Crop insurance is gone | Sakshi
Sakshi News home page

పంటల బీమా గోవిందా!

Jul 14 2015 12:46 AM | Updated on Sep 3 2017 5:26 AM

వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి వచ్చే పత్తి, మిరప పంటల రైతులు ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం

ఈ నెల 9తో ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు
గడువు పెంచాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ లేఖ


హైదరాబాద్: వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి వచ్చే పత్తి, మిరప పంటల రైతులు ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం  వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తమకు అక్కరకు వచ్చే పంటల బీమాను రైతులు ఈ నెల 9తో ముగిసిన గడువులోగా చెల్లించలేకపోవడమే అందుకు కారణం. వాస్తవానికి రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకొని ప్రీమియం చెల్లించాలనుకున్నా సర్కారు రెండో విడత రుణమాఫీ సొమ్మును సగమే చెల్లించడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా రైతులు బీమా సొమ్ము చెల్లించలే ని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురవడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు మొదలుపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 54.77 లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలవగా అందులో అత్యధికంగా 32.77 లక్షల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో మిరప సాగు మొదలైంది. కానీ గత 20 రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా రైతులకు వాతావరణ బీమా ప్రయోజనకరంగా ఉండేది.

కానీ ఈసారి అత్యధిక శాతం మంది రైతులు వాతావరణ ఆధారిత బీమాకు నోచుకునే పరిస్థితి దాటిపోయింది. పత్తి పంటకు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా ప్రీమియానికి ఈ నెల 5న గడువు ముగియగా మిరపకు 9న గడువు ముగిసింది. అప్పటివరకు రైతులందరికీ కలిపి బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1,200 కోట్లకు మించలేదు. అందువల్ల చాలా మంది ప్రీమియం చెల్లించలేకపోయారు. తెలంగాణలో బ్యాంకు రుణాలు పొందే రైతులు దాదాపు 41 లక్షల మంది వరకు ఉంటారు. వారు కాకుండా రుణాలు తీసుకోనివారు మరో 20 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరంతా ప్రీమియం చెల్లిస్తారు. వీరిలో ఇప్పటివరకు నాలుగైదు శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం గడువు పెంచాలని కోరుతూ వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరింది. కేంద్రం అనుమతిస్తే ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement