వంటగ్యాస్ ధర పెంపును వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర పెంపును వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రోజు ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరికి మద్దతు ధర 50 రూపాయలు పెంచారు. దాంతో క్వింటాలు ధర 1360 రూపాయలకు చేరుతుంది.
పత్తి, పప్పుధాన్యాల మద్దతు ధరను కూడా పెంచారు. ఇండస్ట్రియల్ పార్క్‌ల నిర్మాణానికి చైనాతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, వరికి పెంచిన మద్దతు ధర చాలా స్వల్పం అని పలువురు రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మద్దతు ధరను ఇంకా ఎక్కవ పెంచితే ఎక్కువ మంది రైతులు వరిని పండించడానికే ఆసక్తి కనబరుస్తారని కేంద్రం చెబుతోంది. అందువల్ల ఇతర పంటల ఉత్పత్తి తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఆ కారణంగానే మద్దతు ధర ఎక్కవగా పెంచలేదని కేంద్రం తెలిపింది.