నేతల ఆరోపణలు శ్రుతిమించి వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని నపుంసకుడిగా పేర్కొంటూ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: నేతల ఆరోపణలు శ్రుతిమించి వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని నపుంసకుడిగా పేర్కొంటూ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం అల్లర్ల సమయంలో మోడీ పాత్రనుద్దేశించి ఖుర్షీద్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్ సభలో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వ్యక్తులు వచ్చి దాడులు చేస్తుంటే ఆపలేకపోయావు. నువ్వు బలమైన వ్యక్తివి కావు.
నపుంసకుడివి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటు, విచారకరమని, మరింతగా దిగజారిపోయారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్, అరుణ్ జైట్లీలు కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తానన్న వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఖుర్షీద్ సమర్థించుకున్నారు.