‘ఫిట్స్’తో గజగజ.. | Bhujirampeta, venkatapurla In many peoples had Fits | Sakshi
Sakshi News home page

‘ఫిట్స్’తో గజగజ..

Sep 25 2015 2:14 AM | Updated on Sep 3 2017 9:54 AM

‘ఫిట్స్’తో గజగజ..

‘ఫిట్స్’తో గజగజ..

మెదక్ జిల్లాలోని రెండు గ్రామాలు, ఓ తండా ఫిట్స్‌తో గజగజలాడుతున్నాయి.

కౌడిపల్లి: మెదక్ జిల్లాలోని రెండు గ్రామాలు, ఓ తండా ఫిట్స్‌తో గజగజలాడుతున్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో వణికించిన ఈ జబ్బు తిరిగి అలజడి రేపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కౌడిపల్లి మండలంలోని భుజిరంపేట, వెంకటాపూర్‌లతో పాటు మరో తండాలో ఫిట్స్‌తో గత 15 రోజుల్లో 40 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు.
 
గతేడాది ఇదే రోజుల్లో..
గతేడాది ఇవే గ్రామాల్లో పలువురికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయంటూ, మైకం కమ్మి కిందపడిపోతున్నారు. గాయాలకు గురవుతున్నా తెలియనంతగా సొమ్మసిల్లిపోతున్నారు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఏమీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితికి గురవుతున్న వారి ప్రవర్తనను బట్టి ఫిట్స్‌గా భావించి పక్కనున్న వారు బాధితుల చేతిలో తాళాలు పెట్టడం, నుదుటపై వేలితో ఒత్తడం వంటివి చేస్తున్నారు.
 
ఫిట్స్‌తోనే మృతి చెందాడు!
వెంకటాపూర్‌కి చెందిన ఒడిగంటి భిక్షపతి (42) గత సోమవారం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా నీటికుంటలో బోర్లాపడిఉన్నాడు. ఫిట్స్ రావడంతోనే కుంటలో పడి మృతిచెందాడని గ్రామస్తులు అంటున్నారు. తనకు అనారోగ్యమంటే తెలియదని, కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కిందపడిపోయానని, అరగంట తరువాత కోలుకున్నానని వెంకటాపూర్‌కి చెందిన పుట్టి వెంకటేశం తన అనుభవాన్ని చెప్పాడు.

ఎంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి భుజిరంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో బాధితుల్ని గురువారం కౌడిపల్లి పీహెచ్‌సీకి తరలించారు. సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీపీ తెలిపారు. 2 గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
ఆందోళన వద్దు..వైద్యపరీక్షలు నిర్వహిస్తాం
భుజిరంపేట, వెంకటాపూర్‌లలో పలువురు ఫిట్స్‌కు గురవుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆందోళన అవసరం లేదని డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలాజీపవార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కౌడిపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. ఫిట్స్‌తో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement