
భన్వరీ దేవి హత్య కేసులో కీలక అరెస్ట్
భన్వరీ దేవి అపహరణ, హత్య కేసులో సహ నిందితురాలు ఇందిరా బిష్ణోయ్‌ను రాజస్తాన్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు.
జోథ్‌పూర్: సంచలనం సృష్టించిన దళిత నర్సు భన్వరీ దేవి అపహరణ, హత్య కేసులో సహ నిందితురాలు ఇందిరా బిష్ణోయ్‌ను రాజస్తాన్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్ సోదరి అయిన ఇందిరను మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను జోధ్‌పూర్‌లో సీబీఐ అధికారులకు అప్పగించారు. ఇందిరా బిష్ణోయ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో రాజస్తాన్ ఏటీఎస్ ప్రకటించింది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నిందితులుగా ఉన్న ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
అసలేం జరిగింది
36 ఏళ్ల భన్వరీ దేవి 2011, సెప్టెంబర్ 1న జోథ్‌పూర్‌లోని బిలారా ఏరియా నుంచి అపహరణకు గురైంది. ఆమె భర్త అమరచంద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. భన్వరీ దేవిని హత్యచేసి జలోదాలో తగులబెట్టినట్టు వెల్లడైంది. ఆనవాళ్ళేమీ మిగలకుండా ఆమె ఆస్థికలను రాజీవ్ గాంధీ లెఫ్ట్ కెనాల్‌లో దుండగులు కలిపేశారు. భన్వరీ దేవి హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో లోతుగా దర్యాప్తు చేట్టారు.
రాజస్తాన్ అప్పటి మంత్రి మహిపాల్ మాదేర్నా, ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్, కాంగ్రెస్ నేత సాహిరాం విష్ణోయ్‌లను అరెస్ట్ చేశారు. ఈ నేరానికి పాల్పడింది తామేనని విచారణలో వీరు అంగీకరించారు. రాజస్తాన్ అప్పటి మంత్రి మహిపాల్ మాదేర్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భన్వరీ దేవి ఆయనకు తెలియకుండా తాము ఏకాంతంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసింది. ఈ వీడియో సీడీలతో మహిపాల్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో మల్కాన్, సాహిరాం సహాయంతో ఆమెను హత్య చేసినట్టు మహిపాల్ వెల్లడించారు. కోర్టు జోక్యంతో అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్.. మహిపాల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికి రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. అమర్‌చంద్, ఇందిరా బిష్ణోయ్ సహా మొత్తం 13 మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.