అమెరికాలో అరుణ్‌: హెచ్‌1బీ వీసాలపై చర్చ | Arun Jaitley meets US Commerce Secretary, raises H-1B visa issue | Sakshi
Sakshi News home page

అమెరికాలో అరుణ్‌: హెచ్‌1బీ వీసాలపై చర్చ

Apr 21 2017 8:27 PM | Updated on Sep 26 2018 6:44 PM

అమెరికాలో అరుణ్‌: హెచ్‌1బీ వీసాలపై చర్చ - Sakshi

అమెరికాలో అరుణ్‌: హెచ్‌1బీ వీసాలపై చర్చ

అమెరికా పర్యటనలో ఉన్న అరుణ్‌ జైట్లీ అమెరికన్‌ హెచ్‌1బీ వీసాలపై ఆదేశ అధికారులతో చర్చించారు.

- అమెరికా వాణిజ్య కార్యదర్శితో జైట్లీ మాటామంతి
- 5రోజుల పర్యటన నిమిత్తం యూఎస్‌ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి

వాషింగ్టన్‌:
భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపేలా హెచ్‌1బీ వీసాల జారీని కఠిన తరంచేసిన అమెరికా నిర్ణయంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం వాషింగ్టన్‌లో అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్‌ రోస్‌ ను కలుసుకుని వీసాల అంశంపై చర్చించారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

దీనిపై రోజ్‌ స్పందిస్తూ.. హెచ్‌1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి రోస్‌కు జైట్లీ వివరించారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు మొదలైన అంశాలను కూడా ప్రస్తావించారు. జీఎస్‌టీకి వాస్తవ రూపం ఇచ్చినందుకు జైట్లీని రోస్‌ అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన జైట్లీ పలువురు అమెరికన్‌ ఉన్నతాధికారులను కలుసుకునే అవకాశం ఉంది.

హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు.. అత్యున్నత నైపుణ్యం కలిగిన వారికి, అత్యధిక వేతనం తీసుకునే వారికే హెచ్‌1బీ వీసాలను ఇవ్వాలని నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొద్దిరోజుల క్రితం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం 150 బిలియన్‌ డాలర్ల భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అమెరికా చర్యలపై భారత ఐటీ పరిశ్రమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
( భారత ఐటీకి ట్రంప్‌ షాక్‌)
( వీసాపై ట్రంపరితనం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement