మళ్లీ మారిన సీఎం కాన్వాయ్ | Again Changed CM Convoy | Sakshi
Sakshi News home page

మళ్లీ మారిన సీఎం కాన్వాయ్

Aug 6 2015 9:06 AM | Updated on May 29 2018 11:47 AM

మళ్లీ మారిన సీఎం కాన్వాయ్ - Sakshi

మళ్లీ మారిన సీఎం కాన్వాయ్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు... అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం కాన్వాయ్‌లో కనిపించనున్నాయి.

* రూ. 5.50 కోట్లతో ల్యాండ్ క్రూయిజర్లు
* మూడోసారి మారిన వాహన శ్రేణి


సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు... అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం  కాన్వాయ్‌లో కనిపించనున్నాయి. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి తర్వాత అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ని కేసీఆర్ మాత్రమే వాడుతున్నట్టు సమాచారం. దాదాపు ఒక్కోటి రూ. కోటి 10 లక్షల చొప్పున అయిదు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాలు ఇందులో ఉన్నాయి.

బుధవారం ఉదయం యాదగిరిగుట్టలో వీటికి పూజ చేయించారు. అనంతరం కొత్త కాన్వాయ్‌లోనే సీఎం సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఇంతకు ముందు అయిదు ఫార్చూనర్, రెండు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఉండేవి. వీటిస్థానంలో ఇప్పుడు అయిదు క్రూయిజర్, రెండు ఫార్చూనర్ వాహనాలు, అంబులెన్స్‌తో భద్రతా విభాగం కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఈ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాన్ని అమర్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసీఆర్ కాన్వాయ్‌లో నల్లరంగు ఫార్చూనర్ వాహనాలు ఉండేవి.

ముఖ్యమంత్రి సూచనలతో ఈ వాహనాల రంగును మార్చేందుకు అప్పట్లోనే ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేసింది. అన్ని వాహనాలను తెలుపు రంగులోకి మార్పించారు. అనంతరం రెండు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు మొత్తం కాన్వాయ్‌ను క్రూయిజర్ వాహనాలతో సిద్ధం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల్లో భద్రతకు వీలుగా కొత్తగా రక్షక్ వాహనాన్ని సైతం తెప్పించారు. దీంతోపాటు రూ.5 కోట్లతో తయారు చేసిన ఒక ప్రత్యేక బస్సును హరితహారం జిల్లాల పర్యటన కోసం కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement