
త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం
వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినుల మృతిపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది.
విద్యార్థినుల మృతిపై కడప నారాయణ కళాశాల ప్రిన్సిపాల్‌ను విచారించిన సభ్యులు
* మూడురోజులపాటు విచారణ కొనసాగుతుందని వెల్లడి
సాక్షి ప్రతినిధి, కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినుల మృతిపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్న సాయి మనీషా(16), నందిని(16)లు ఈ నెల 17న అనుమానాస్పద రీతిలో మృతిచెందడం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడమూ విదితమే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఇంటర్ బోర్డు సహాయ కార్యదర్శి మాణిక్యం, కడప డీఆర్‌ఓ కె.సులోచనలతో విచారణ కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు గురువారం ఉదయం నారాయణ కళాశాలకు వెళ్లారు. రికార్డుల్ని తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ సుజాతను విచారించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులపాటు సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
త్రిసభ్య కమిటీ విచారణలోనూ గోప్యత
ఇద్దరు విద్యార్థినుల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినా... అలాంటిదేమీ కనిపించడంలేదు. గుట్టుచప్పుడు కాకుండా కళాశాలకు వెళ్లిన కమిటీ సభ్యులు మీడియాను లోనికి అనుమతించలేదు. అంతేగాక సభ్యులు కళాశాలకు చేరేటప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల ఇన్‌చార్జిలందరూ అక్కడ తిష్టవేయడమేగాక.. విచారణ ఎదుర్కొంటున్నవారికి సూచనలు, సలహాలు అందిస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళాశాలలో మొత్తం 560 మందిదాకా విద్యార్థినులున్నారు. ఘటన జరిగిన వెంటనే అందర్నీ ప్రత్యేక వాహనాల్లో ఇళ్లకు తరలించారు. వారం రోజులుసెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడురోజులపాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ వెల్లడించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జ్యుడీషియల్ విచారణకు డిమాండ్
త్రిసభ్య విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, జ్యుడీషియల్ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా డిమాండ్ చేశారు. విద్యార్థుల్లేకుండా విచారణ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థినులందరినీ క్యాంపస్‌కు రప్పించి.. అందర్నీ విచారిస్తే చాలా విషయాలు వెలుగు చూస్తాయని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వి.గంగాసురేష్ పేర్కొన్నారు.