
24 రోజుల్లో 173 మరుగుదొడ్లు
‘ప్రతి ఇంటికి ఓ మరుగుదొడ్డి’ పథకం అమలు చేయడంటూ టెలివిజన్, వార్తా పత్రికల్లో బాలివుడ్ ప్రముఖ తార విద్యాబాలన్ యాడ్ కనిపిస్తుంది.
కర్నాటకలో ఓ గ్రామం సక్సెస్ స్టోరీ
బెంగళూరు: ‘ప్రతి ఇంటికి ఓ మరుగుదొడ్డి’ పథకం అమలు చేయడంటూ టెలివిజన్, వార్తా పత్రికల్లో బాలివుడ్ ప్రముఖ తార విద్యాబాలన్ యాడ్ కనిపిస్తుంది. దాన్ని ఎంతమంది ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకుంటారో తెలియదుగానీ కర్నాటకలోని ఖానాపూర్ గ్రామం పంచాయతీ నాయకురాలు ప్రేమ తిమ్మనగౌడర్ మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నారు. గ్రామంలోని 173 ఇళ్లలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను కట్టించారు.
ఖానాపూర్‌తోపాటు మరో రెండు గ్రామాలకు చైర్‌పర్సన్‌గా ప్రేమ గత జూలై నెలలోనే ఎన్నికయ్యారు. తాను ఎన్నికయ్యే వరకు గ్రామంలో పది శాతం ఇళ్లలో కూడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవికూడా పరిశుభ్రంగా లేకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆమె వెంటనే మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. దాదాపు 90 శాతం మంది ప్రజలు ఆమె ప్రతిపాదనను వ్యతిరేకించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. తన ఆందోళనను అర్థం చేసుకున్న పది శాతం మంది ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతను తీసుకొని కాళ్లరిగేలా మళ్లీ ఇల్లిళ్లూ తిరిగారు. కొంత సానుకూలత పెరిగింది.
ముందుగా మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించిన ఇళ్ల నుంచి పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మొత్తం గ్రామంలో 173 మరుగుదొడ్లు నిర్మించాలని పంచాయతి సమక్షంలో ప్రేమ నిర్ణయం తీసుకున్నారు. ఖర్చును అంచనా వేశారు. నాలుగు లక్షల రూపాయలు అవుతుందని లెక్క తేల్చారు. అంత సొమ్ము పంచాయతీ వద్ద లేదు. ప్రేమతోపాటు పంచాయతీ సిబ్బంది, యువత శక్తిమేరకు చందాలు వేసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానంతరం ఎలాగు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు చెల్లింపులు చేస్తారని తెలిసిన ప్రేమ ధైర్యంగా కొంత అప్పుకూడా చేశారు.
ఊరిలో అందరి నుంచి సహాయం అర్థించారు. కొందరు సమీపంలోని వాగు నుంచి ఇసుకను తీసుకరావడానికి అద్దె లేకుండా వాహనాలు ఇచ్చారు. మరికొందరు శక్తిమేరకు ఇటుకలు, రాళ్లు ఇచ్చారు. కొన్ని రోజులు కొంతమంది స్వచ్ఛందంగా కూలి చేశారు. సిమ్మెంటును మాత్రం కొనుగోలు చేయక తప్ప లేదు. ఇలా తలా ఓ సాయం చేస్తూ ఊరంతా కలిసిపోగా మరుగుదొడ్లను వద్దన్నవారు కూడా ముందుకొచ్చారు.
అంతే రికార్డు స్థాయిలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను విజయవంతంగా పూర్తి చేశారు. చైర్‌పర్సన్ ప్రేమ తిమ్మనగౌడర్ కృషిని ప్రశంసిస్తూ కేంద్రం మరుగుదొడ్ల నిర్మాణానికయిన ఖర్చును తక్షణమే రీఎంబర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.