తొలి సమావేశానికి వేళాయె

ZPTC First Meeting In Medak District - Sakshi

అత్యవసర శాఖలపై రివ్యూ

హాజరు కానున్న  ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు,  ఎంపీలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సాక్షి, సిద్దిపేట: నూతన జిల్లాల ఆవిర్భావంతో ప్రజలకు ప్రభుత్వం చేరువైంది. అదే వేగంతో నూతన జిల్లా పరిషత్‌ల ఏర్పాటు, ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌ తొలి సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగా సర్వం సిద్ధం చేసింది. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం తర్వాత నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశం కావడం గమనార్హం.

అయితే ఇంతవరకు స్థాయీ సంఘాల నియామకం కూడా జరగకపోవడంతో ఉదయం స్థాయీ సంఘాల నియామకం చేపట్టి, మధ్యాహ్నం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సభ్యులు హాజరుకానున్నారు. అదేవిధంగా  కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌తోపాటు అన్నిశాఖలకు చెందిన అధికారులు కూడా ఈ సభకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.జిల్లా పరిషత్‌ పనివిధానంలో భాగమైన స్థాయీ సంఘాల నియామకం కూడా బుధవారం ఉదయం జరగనుంది.

 ఆర్థిక, పనులు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంతోపాటు స్త్రీశిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ స్థాయీ సంఘాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సంఘాలకు ఆర్థిక, అభివృద్ధి పనులు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం సంఘాలకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ చైర్మన్‌గా ఉంటుంది. మరో నలుగురు జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా స్త్రీ శిశుసంక్షేమశాఖకు మహిళా జెడ్పీటీసీ సభ్యురాలు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సాంఘిక సంక్షేమ స్టాండింగ్‌ కమిటీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన వారిని సభ్యులుగా, ఒకరిని చైర్మన్‌గా నియమిస్తారు. వీటితోపాటు వ్యవసాశాఖ స్థాయి సంఘానికి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ తంతు అంతా ఉదయం పూర్తి చేసి, మధ్యాహ్నం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి వెళ్తారు.

హాజరు కానున్న సభ్యులు 
తొలి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, 22 మంది జిల్లా పరిషత్‌ సభ్యులు, ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులతోపాటు, 23 మంది ఎంపీపీలు హాజరు కానున్నారు.  జిల్లాకు చెందిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌లతోపాటు, మానకొండూరు, జనగామ ఎమ్మెల్యేలు జెడ్పీ పరిధిలోకి వస్తారు. ఇందులో గజ్వేల్‌ ఎమ్మెల్యే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మినహా మిగిలిన హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, ఒడితల సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రసమయి బాలకిషన్‌ హాజరుకానున్నారు. అదేవిధంగా మెదక్, నల్గొండ, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌ హాజరవుతారు. వీరితోపాటు ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్, రఘోత్తంరెడ్డికి కూడా ఆహ్వానం పత్రాం అందజేశామని ఇన్‌చార్జి సీఈవో గోపాల్‌రావు తెలిపారు.

అత్యవసర శాఖలపై సమీక్ష
జిల్లా పరిషత్‌ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన అత్యవసర శాఖలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎజెండా కాపీలను సైతం అందరు సభ్యులకు పంపించామన్నారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానంగా హరిత హారంలో అందరిని భాగస్వామ్యం చేసేందుకు తొలి జెడ్పీ సమావేశం వేదిక కానుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top