ప్రభుత్వం మెడలు వంచుతం!

YSRCP  Leader Gattu Srikanth Reddy Comment On TRS Government Karimnagar - Sakshi

కరీంనగర్‌/టవర్‌సర్కిల్‌: నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరు చేపట్టి కేసీఆర్‌ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకునేందుకు నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం అంటూ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై, ప్రభుత్వం వైఖరిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడట్టాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభకు ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయకుండా పూటకో మాట మాట్లాడుతూ కాలం వెల్లదీసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే సంకేతాలి వ్వడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన లక్ష ఉద్యోగాలతోపాటు నాలుగేళ్లలో పదవీ విరమణ పొందిన మరో 50 వేల ఉద్యోగాలతో కలిపి మొత్తం లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేతకాని వ్యవస్థలా తయారైందని పేరుకే పబ్లిక్‌ కమిషన్‌గా ఉందని, నియామకాల ఊసేలేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 19 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. టీపీఎస్‌సీ కేవలం లక్షల వేతనాలు పొందే వ్యవస్థగా మారిందని ఆరోపించారు. లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు లక్ష ఉద్యోగాలు భర్తీచేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్‌ విసిరారు.

నిధులు, నీళ్లు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ ఏమిచ్చారని ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మహానేత వైఎస్‌ఆర్‌ చేపట్టిన ప్రాజెక్టులకే రీ డిజైనింగ్‌ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని అన్నారు. ముందస్తు ఎన్నికల పేరిట ప్రజలను మరోమారు మోసం చేయడానికే సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని రెండు సార్లు ఒంటి చెత్తో అధికారంలోకి తెచ్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న కాంగ్రెస్‌ నేతలు.. సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని.. చంద్రబాబు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన టీఆర్‌ఎస్‌ నేతలు..
మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎస్సీసెల్‌ జిల్లా అద్యక్షుడు సంతోష్‌ ఆద్వర్యంలో పలువురు యువకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు.

వైఎస్సార్‌ విగ్రహంతో ర్యాలీ..
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంతో వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి స్వాగతం పలికి ప్రతిమ క్రాసింగ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభాస్థలి స్టేజీపై ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందు నుంచే సాంస్కృతిక బృందం కళాకారులతో దివంగత వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాడిన పాటలు సభికులను అలరించాయి.

నిరుద్యోగ గర్జనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లకుమార్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, మేడ్చల్‌ జిల్లాల అధ్యక్షులు కట్ట శివ, పి.రాము, పి.గోవర్ధన్‌శాస్త్రి, సుధీర్, శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల గణేష్, మహిళా విభాగం కరీంనగర్‌ జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, మహిళా విభా గం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు మోకెనపెల్లి రాజమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటక సంప త్, కరీంనగర్‌ నగర అధ్యక్షుడు ఇంజినీర్‌ సాన రాజన్న, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణరెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ షాహెన్‌షా, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శులు దీటి సుధాకర్, కేతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సోషల్‌ మీడి యా ఇన్‌చార్జి ఎండీ వలీయోద్దీన్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని గద్దె దించాలి 
ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని గద్దె దించాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి, చేసేదొకటిలా ఉంది. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదు. దళిత గిరిజనులకు వాగ్దానాలే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. –సంజీవరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నిరుద్యోగులకు బాసటగా నిలుద్దాం 
నామమాత్రపు నోటిఫికేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు బాసటగా నిలుద్దాం. నాలుగేళ్లుగా నెరవేర్చని హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. – బెజ్జంకి అనిల్‌కుమార్,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top