
సాక్షి, సిరిసిల్ల: జిల్లా నిండా యువోత్సాహం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో 51.54 శాతం 39 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారు. రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే.. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. జిల్లా జనాభాలో 73.20 శాతం ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల నాటి వివరాలను పరిశీలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి చాలామార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా 27,896 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
‘యువ’ ఓటర్లే అధికం
జిల్లా ఓటర్ల సంఖ్య 4,33,902 కాగా ఇందులో 18 – 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 2,23,638 ఉంది. అంటే జిల్లా ఓటర్లలో 51.54 శాతంగా నమోదైంది. సగానికి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. ఎన్నికల సంఘం ఇటీవల కల్పించిన ఓటర్ల నమోదులో కొత్తగా 27,896 నమోదు ఓటర్లుగా తమ పేర్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫాం–6 ద్వారా అనేకమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం విశేషం.
మహిళా ఓటర్లు అధికం
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,11,324 కాగా.. మహిళలు ఓటర్లు 2,22,572 మంది ఉన్నారు. పురుషుల కంటే 1,1248 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గెలుపోటముల్లో మహిళల పాత్ర కీలకంగా మారనుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల్ఫ్ వలసలు కారణాలుగా భావిస్తున్నారు.
జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గం | పురుషులు | మహిళలు | ఇతరులు | మొత్తం |
సిరిసిల్ల | 1,11,926 | 1,15,994 | 3 | 2,27,923 |
వేములవాడ | 99,398 | 1,06,578 | 3 | 2,05,979 |