అపూర్వ  పంటలు | light weight terrace garden Gajawada swaroopa | Sakshi
Sakshi News home page

అపూర్వ  పంటలు

Sep 18 2025 4:26 AM | Updated on Sep 18 2025 4:26 AM

light weight terrace garden Gajawada swaroopa

అక్షయ పాత్ర సొరకాయ గురించి ఎప్పుడైనా విన్నారా? బోతరాసి పండ్ల గురించి బొత్తిగా తెలియదా? ... కొన్ని తరాల వెనక్కి వెళితే అపూర్వమైన కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నో కనుమరుగవుతున్నాయి. అలా కనుమరుగవుతున్న కూరగాయలు, పూలు, పండ్లకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తోంది స్వరూప.

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన గజవాడ స్వరూప అ‘పూర్వ’మైన కూరగాయలు, పూల మొక్కలను పెంచుతోంది. పూర్వకాలంలో మన పెద్దలు ఇంటి పెరటిలో, ఇంటి ముందు విత్తనాలు నాటి పండించే పంటలను కళ్లముందు ఆవిష్కరిస్తోంది. 

అక్షయ పాత్ర సొరకాయ నుంచి కాశీ తులసి వరకు
 కూరగాయల మార్కెట్‌లో దొరకని పూర్వపు గుమ్మడి సొరకాయ, అక్షయ పాత్ర సొరకాయ, నల్ల సొరకాయ... ఇలా సొరకాయల్లో 40 రకాలు, టమాటాలు పది రకాలు, చిక్కుడు కాయలు ఐదు రకాలు, బుడం కాయలు పది రకాలు, తీగకు కాసే ఆలుగడ్డలు, బోతరాసి పండ్లు, ఐదు రకాల బెండ కాయలు, అడవి కాకర, ΄÷ట్టి కాకర, రుద్రాక్ష కాకర, ఆపిల్‌ బొ΄్పాయి, నాటు దొండ, గెల చిక్కుడు, అడవి దోస, ముళ్ల వంకాయ, ΄÷ట్టి΄÷ట్లకాయ, సూర్యముఖ మిర్చి, కాశీ తులసీ, ధనియాలు, కొత్తిమీర, నల్ల అల్లం, లక్కడో¯Œ  పసుపు, చెమ్మకాయలు, సూదినిమ్మ, చామంతి, జడపత్రి, బచ్చలాకు, నల్లేరు...ఇలా పూర్వపు కూరగాయలను, పూలను, పండ్లను పండిస్తోంది. 

దశాబ్ద కాల అపూర్వ కృషి
చిన్నప్పుడు కరీంనగర్‌లో, చుట్టాల ఇళ్ల దగ్గర రకరకాల కూరగాయలను చూసింది స్వరూప. కాలక్రమంలో ఎన్నో కూరగాయలు కనుమరుగు కావడాన్ని కూడా చూసింది. ఇలాంటి అరుదైన రకాలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో దశాబ్దకాలంగా అపురూపమైన  కూరగాయల విత్తనాల సేకరణ మొదలుపెట్టింది.
9వ తరగతి వరకు చదువుకున్న స్వరూపకు పూర్వపు కూరగాయల విలువ బాగా తెలుసు. అందుకే ఏ ఊరు వెళ్లినా  పాత తరం కూరగాయలు కనిపిస్తే విత్తనాలు సేకరించేది. ఆమె ఆసక్తిని భర్త నాగరాజు ప్రోత్సహించాడు. సిరిసిల్ల శివారులోని భూపతినగర్‌ లో కొంత భూమిని కొనుగోలు చేసి అక్కడ కూరగాయల క్షేత్రాన్ని ప్రారంభించి తాను పండించిన పంటలను విక్రయిస్తూ దేశీయ విత్తనాలపై ఆసక్తి ఉన్నవారికి సరఫరా చేస్తోంది.

ఇల్లంతా పచ్చదనమే!
స్వరూప, నాగరాజు దంపతుల ఇల్లు  పాత తరం కూరగాయల చెట్లు, విత్తనాల కాయలతో ‘వెజిటెబుల్‌ మ్యూజియం’ను తలపిస్తుంది. ఇంట్లో అంజీరా, ఆపిల్‌ బేర్, జామ, బెంగళూర్‌ చెర్రీ, ద్రాక్ష... ఇలా రకరకాల మొక్కలతో ఇల్లంతా పచ్చదనం కొలువై ఉంటుంది. 2018లో స్వరూప కృషిని గుర్తించిన అప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆమెను సత్కరించారు. రాష్ట్ర ఉద్యానవనాల శాఖ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి మెమెంటోతో అభినందించారు. సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి  పాతతరం కూరగాయల గురించి ప్రచారం చేస్తోంది స్వరూప.

కష్టమే... అయినా ఇష్టమే!
మన తాత, ముత్తాతల కాలంనాటి కూరగాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే లక్ష్యంతో ఎక్కడికి వెళ్లినా పూర్వపు కూరగాయల విత్తనాలను సేకరించాను. నా దగ్గర ఆకుకూరలు, కూరగాయలు, పూలకు సంబంధించి ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. వాటిని మార్కెట్‌లో విక్రయిస్తున్నాను. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో నేనే చొరవ తీసుకొని వాటిని నాటుతున్నాను. అవి పెరిగి పెద్దవై అందరికీ ఉపయోగపడతాయని నా ఆలోచన. ఈ పని చేయడం అంత సులభం కాదు. కానీ కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తున్నాను. 
– స్వరూప

– వూరడి మల్లికార్జున్, 
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement