సుకన్య సమృద్ధి యోజనపై కలెక్టర్‌ చాలెంజ్‌

Yogitha Rana Sukanya Samriddhi Yojana Challenge - Sakshi

పది మంది అమ్మాయిలకు తొలి విడత ప్రీమియం అందజేత

20 మందికి స్పాన్సర్‌ చేసిన బీబీబీపీ స్పెషల్‌ అధికారి

సాక్షి, హైదరాబాద్‌: హరితహారం గ్రీన్‌ చాలెంజ్‌ స్ఫూర్తితో బాలికల సుకన్య సమృద్ధి యోజన పథకంపై జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా చాలెంజ్‌ విసిరారు. సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్‌గా పది మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. తొలి విడత వార్షిక ప్రీమియం స్పాన్సర్‌గా  రూ.2500 లను బండ్లగూడ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌కు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో  నిర్వహించిన బేటీ బచావో– బేటీ పడావో అమలుపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ ఈ మేరకు చాలెంజ్‌ చేశారు. దీంతో బేటీ బచావో.. బేటీ పడావో జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ జగన్నాథరావు స్పందించి 20 మంది పిల్లలకు రూ.5000 స్పాన్సర్‌ చేశారు. అధికారులందరూ తమ సామాజిక బాధ్యతగా సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్‌ స్వీకరించాలని  కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు.

బేటీ బచావో బేటీ పడావో  కార్యక్రమం అమలులో భాగంగా మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల్లోని బాలికల భవిష్యత్తు కోసం ప్రతి జిల్లా మండలస్థాయి అధికారి పదిమంది బాలికల చేత సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాలను  తెరిపించాలని కలెక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన ఆడశిశువు నుంచి పదేళ్ల బాలికలకు 14వ సంవత్సరం వచ్చే వరకు వార్షిక ప్రీమియంగా కనీసం రూ. 250 చొప్పున  చెల్లిస్తే 21 సంవత్సరాల  వయసు వచ్చిన తర్వాత  మెచ్యూరిటీ సొమ్మును వడ్డీతో పాటు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గతంలో వార్షిక కనీస ప్రీమియం రూ.1000 ఉండేదని, దానిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.250లకు తగ్గించిందన్నారు. పోస్టాఫీసులో ఈ ఖాతాలు ప్రారంభించాలని కలెక్టర్‌ యోగితా రాణా సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top