నాకు అసలే సిగ్గు బాబు! | Yasin Bhatkal Files Petition On Video Conference Interrogation | Sakshi
Sakshi News home page

నాకు అసలే సిగ్గు బాబు!

Mar 6 2018 2:01 AM | Updated on Sep 28 2018 4:48 PM

Yasin Bhatkal Files Petition On Video Conference Interrogation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు... దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... దేశ వ్యాప్తంగా 149 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది... గతేడాది ఉరి శిక్ష కూడా పడిన యాసీన్‌ భత్కల్‌కు కెమెరాను ఫేస్‌ చేయాలంటే సిగ్గట. ఈ విషయాన్ని అతడే ఢిల్లీ న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు.

తనకు కెమెరా షై ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే ప్రక్రియను ఆపాలని కోరాడు. ఈ మేరకు గత వారం ఢిల్లీ సిటీ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే నిఘా వర్గాలు మాత్రం కేసు విచారణ జాప్యం జరిగేలా చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని అంటున్నారు.  

తీహార్‌ జైలు ‘ఏకాంత కారాగారం’లో
కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన యాసీన్‌ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్‌. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్‌ అండ్‌ కో’కు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌ కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్‌ తదితరుల్ని తీసుకువెళ్లారు.

ప్రస్తుతం యాసీన్‌ను తీహార్‌ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్‌మెంట్‌) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్‌ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్‌ను బెంగళూరు న్యాయస్థానం తీహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తోంది. ఇక్కడే ఈ ఉగ్రవాదికి ‘సిగ్గు పుట్టుకు’వచ్చింది.
 
జాప్యం చేయడానికే...
కేసు విచారణకు అడ్డంకులు సృష్టించి జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ పూర్తయితే ఇప్పటికే పడిన ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం కోసమే యాసీన్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు అంచనా వేస్తున్నాయి. కాగా భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్‌ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు.

గతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ తీసుకువెళ్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలీకాఫ్టర్‌ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. యాసీన్‌ పిటిషన్‌ ఢిల్లీ సిటీ సెషన్స్‌ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ కారణాలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.   

కెమెరా షై అంటూ పిటిషన్‌...
కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బెంగళూరు కోర్టు విచారణ ఎదుర్కొంటున్న యాసీన్‌ భత్కల్‌ గత సోమవారం ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశాడు. కెమెరా షై ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ పేర్కొన్నాడు. కేసుకు సంబం«ధించిన చర్చలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన లాయర్లను బెంగళూరు నుంచి తీహార్‌ జైలు వరకు రప్పించడానికి భారీగా ఖర్చు అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ముంబై దాడులకు (26/11 ఎటాక్స్‌) కీలక పాత్రధారిగా ఉండి, సజీవంగా పట్టుబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు విచారణ నేపథ్యంలో ఇచ్చిన వెసులుబాట్లలో కొన్ని తనకూ వర్తింపజేయాలని యాసీన్‌ విన్నవించుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement