
యజ్ఞంలా హరితహారం
ఎన్నో ఉద్యమాలతో సమిష్టిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మలచాలంటే హరితహారం ఒక యజ్ఞంలా సాగాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు...
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
మిరుదొడ్డి: ఎన్నో ఉద్యమాలతో సమిష్టిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మలచాలంటే హరితహారం ఒక యజ్ఞంలా సాగాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. హరిత హారంలో భాగంగా మిరుదొడ్డిలో తెలంగాణ మోడల్ స్కూల్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలు, ఎస్సీ, బీసీ వసతి గృహాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, మండల పరిధిలోని చెప్యాల-అల్వాల గురుకుల బాలుర పాఠశాలల్లో సోమవారం ఆయన ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మిరుదొడ్డిలో నైపుణ్య ఆర్గనైజేషన్, గురుకుల బాలుర పాఠశాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అడవులు అంతరించి పోయాయని, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కరువు నెలకొందన్నారు. వరుణ దేవుణ్ని జయించడం మన చేతుల్లోనే ఉందని, అందుకోసం హరిత హారాన్ని ఆయుధంగా మలచాలన్నారు. హరిత హారంలో ముందున్న నియోజకర్గాలకు సీఎం రూ. 5 కోట్ల బహుమతి అందిస్తారన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో హరిత హారంపై ప్రతిజ్ఞ చేయించారు.
దుబ్బాకకు గోదావరి నీళ్లు
దుబ్బాక నియోజకవ ర్గంలో వ్యవసాయం, సాగునీటి కోసం గోదావరి నీళ్లు అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు. రూ. 8 వేల కోట్లతో మిడ్ మానేరు, కొమురెల్లిలో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు.
వాటర్ గ్రిడ్‌తో తాగునీరందిస్తాం
తెలంగాణలోని 119 నియోజక వర్గాలకు రూ. 30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగు నీరందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మరో యేడాదిలోగా ఇంటింటికి తాగు నీరందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
వానలను మళ్లీ రప్పించాలి
వర్షాలు లేక తల్లడిల్లుతున్న తెలంగాణలో మొక్కలు నాటి వర్షాలను రప్పించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
-ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హరిత హారంలో ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. వెనుకబడిన దుబ్బాక ప్రాంతాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ శివానీ డోగ్రే, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వెంకట్ రామారావు, సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాం సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -ఎమ్మెల్యే రామలింగారెడ్డి