breaking news
Minister tanniru harishrao
-
కాంగ్రెస్ రైతు గర్జన ఎవరికోసం?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రైతు గర్జన పేరుతో హంగామా చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ జిల్లాల్లో తిరిగితే పరిస్థితి తెలిసేదన్నారు. అధికారంలో కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు చేసే రైతుగర్జన ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి అదనంగా 2,642 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.23.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఆయన మాక్లూర్ మండలంలోని గుత్ప, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిల వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మునిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమి చేస్తున్నారో రైతు గ ర్జనలో చెప్తారా? లేక మా వల్లే నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్లేగ్రౌండ్‌లా మారిందని చెప్తారా? అని హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక మునిగిపోయేంత వర్షాలు పడితే తప్ప నిజాంసాగర్‌లోకి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నింపాలన్న ప్రయత్నాన్ని ఓ వైపు అడ్డుకుంటూ.. మరోవైపు రైతు గర్జన చేయడం ప్రజాద్రోహం అవుతుందని పేర్కొన్నారు. సింగూరు జలాలను గత పాలకులు హైదరాబాద్ తాగునీటికోసం తరలించడం వల్ల మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తున్నందున సింగూరు జలాలను ఈ రెండు జిల్లాల ఆయకట్టుకే కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, వీజీ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వం అవసరం: డీఎస్ తెలంగాణ ఏర్పాటు ఎంతటి చారిత్రక అవసరంగా నిలిచిందో.. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అంతే అవసరం అని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వాన్ని పటిష్ట పరచాలని పిలుపునిచ్చారు. మంజీర నదిపై పొరుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
- ఆత్మహత్యలతో సమస్యలుపరిష్కారం కావు - గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి - గోదావరి నీటితో కరువును పారదోలుతాం - అప్పులోళ్లు వేధిస్తే..అధికారులకు చెప్పండి - బాధిత రైతు కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు భరోసా సిద్దిపేట రూరల్: ‘రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుం దని.. ఏ రైతు ఆధైర్యపడొద్దు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక శివమ్స్ గార్డెన్లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. జిల్లాలో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. అదే విధంగా సీమాంధ్రుల పాలనలో మెదక్ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు కాకపోవడంతో కరువు ప్రాంతంగా మారిందన్నారు. కరువును పారదోలేందుకు గోదావరి నీళ్లు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరత యత్నం చేస్తున్నారన్నారు. గోదావరి నీళ్లు సిద్దిపేటకు వస్తే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని సుమారు 20 నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అప్పుల వాళ్లు వేధిస్తే తహశీల్దార్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఏర్పడిన విద్యుత్ సమస్య కూడా తీరుస్తామన్నారు. అంతకు ముందు నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో తొమ్మిది మంది రైతు కుటుంబాలకు రూ. 1.50లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే ఆపద్బంధు పథకం కింద ఐదుగురికి రూ. 50వేల చొప్పున చెక్కులను అందించారు. రైతు కుటుంబాలతో కలిసి భోజనం... రైతు ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలతో మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డిలు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయాకుటుంబాల్లో చదువుకునే పిల్లలుంటే పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు సంబంధించి వైద్య ఖర్చులుంటే ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద అదుకుంటామన్నారు. అదే విధంగా ఆయా కుటుంబాలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ నర్సింహారెడ్డి, ఎంపీడీఓలు, నాయకులు రాజనర్సు, మణిక్యరెడ్డి, రాధాకృష్ణశర్మ, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యజ్ఞంలా హరితహారం
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మిరుదొడ్డి: ఎన్నో ఉద్యమాలతో సమిష్టిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మలచాలంటే హరితహారం ఒక యజ్ఞంలా సాగాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. హరిత హారంలో భాగంగా మిరుదొడ్డిలో తెలంగాణ మోడల్ స్కూల్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలు, ఎస్సీ, బీసీ వసతి గృహాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, మండల పరిధిలోని చెప్యాల-అల్వాల గురుకుల బాలుర పాఠశాలల్లో సోమవారం ఆయన ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిరుదొడ్డిలో నైపుణ్య ఆర్గనైజేషన్, గురుకుల బాలుర పాఠశాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అడవులు అంతరించి పోయాయని, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కరువు నెలకొందన్నారు. వరుణ దేవుణ్ని జయించడం మన చేతుల్లోనే ఉందని, అందుకోసం హరిత హారాన్ని ఆయుధంగా మలచాలన్నారు. హరిత హారంలో ముందున్న నియోజకర్గాలకు సీఎం రూ. 5 కోట్ల బహుమతి అందిస్తారన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో హరిత హారంపై ప్రతిజ్ఞ చేయించారు. దుబ్బాకకు గోదావరి నీళ్లు దుబ్బాక నియోజకవ ర్గంలో వ్యవసాయం, సాగునీటి కోసం గోదావరి నీళ్లు అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు. రూ. 8 వేల కోట్లతో మిడ్ మానేరు, కొమురెల్లిలో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. వాటర్ గ్రిడ్‌తో తాగునీరందిస్తాం తెలంగాణలోని 119 నియోజక వర్గాలకు రూ. 30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగు నీరందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మరో యేడాదిలోగా ఇంటింటికి తాగు నీరందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వానలను మళ్లీ రప్పించాలి వర్షాలు లేక తల్లడిల్లుతున్న తెలంగాణలో మొక్కలు నాటి వర్షాలను రప్పించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. -ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హరిత హారంలో ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. వెనుకబడిన దుబ్బాక ప్రాంతాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ శివానీ డోగ్రే, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వెంకట్ రామారావు, సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాం సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -ఎమ్మెల్యే రామలింగారెడ్డి