గ్రీన్‌.. గుట్ట | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 3:20 AM

Yadadri Officials Focus On Greenery And Tourism - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పెద్దగుట్టలో పరుచుకున్న పచ్చదనం పర్యాటకులను, భక్తులను ఆకట్టుకుంటోంది. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్దగుట్ట సుందరీకరణ ఒకటి. ఇప్పటికే ఇక్కడ చేపట్టిన లేఅవుట్లు, రోడ్లు, సుందరీకరణ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వారాంతంలో యాదాద్రికి వచ్చే భక్తులకు పెద్దగుట్ట కనువిందు చేస్తోంది. 250 ఎకరాల్లో లేఅవుట్‌ పనుల్లో భాగంగా 202 ఓపెన్‌ ప్లాట్లను సిద్ధం చేశారు. తిరుమల తరహాలో దాతల సాయంతో ప్రత్యేక సూట్‌లను అన్ని వసతులతో నిర్మించనున్నారు. త్వరలో దాతల పేర్లను సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం రూ.207 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావొచ్చాయి. 

రోడ్లకు ఇరువైపులా పచ్చదనం..
పెద్దగుట్ట లేఅవుట్‌ అభివృద్ధిలో ప్రధానమైన రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కావొస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం కోసం హెచ్‌ఎండీఏ పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటుతోంది. అంతేగాకుండా రెండు చోట్ల చిన్న నీటి సరస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ల్యాండ్‌ స్కేప్‌లు ఏర్పాటు చేశారు. 

పాతగుట్టకు రోడ్డు సౌకర్యం..
పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు పెద్దగుట్ట నుంచి రోడ్డు సౌకర్యం కల్పిం చారు. భక్తులు కొండపైన స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట పట్టణంతో సంబంధం లేకుండా పెద్దగుట్టపై నుంచి పాతగుట్ట స్వామివారి వద్దకు చేరుకునేలా రోడ్డును నిర్మించారు. నూతనంగా మరో రోడ్డును మల్లాపురం రోడ్డు నుంచి నిర్మిస్తున్నారు.  

ప్రారంభమైన ప్రెసిడెన్షియల్‌ సూట్లు
గుట్టకు వచ్చే వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి తదితర వీవీఐపీల కోసం ఒక ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను నిర్మిస్తున్నారు. 10 భవనాలు, గండి చెరువు వద్ద కల్యాణ కట్ట, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు పనులు జరుగుతున్నాయి. తులసీ వనంలో నిర్మించిన రెండు సరస్సులలో బోటింగ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు.  


 

Advertisement

తప్పక చదవండి

Advertisement