5 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు

World Telugu Conference delegates names listed - Sakshi

ఇప్పటి వరకు 2000 మంది

15 నుంచి 19 వరకు జరిగే తెలుగు మహాసభలకు చురుగ్గా ఏర్పాట్లు  

సాక్షి, హైదరాబాద్‌:  ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 2000 మందికిపైగా ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 1,473 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతినిధుల నమోదుకు డిసెంబర్‌ 5వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. సుమారు 6 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు అకాడమీ అంచనా వేస్తోంది. ఇందుకు తగిన విధంగానే భోజనం, రవాణా, వసతి, తదితర సదుపాయాలపైన అధికారయంత్రాంగం దృష్టి సారించింది.

ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగులలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలలో మహాసభలు జరుగనున్న సంగతి తెలిసిందే. నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఆదివాసీ, గిరిజన, జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ప్రతినిధులు తమకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 19 వరకు 5 రోజులపాటు జరుగనున్న ఈ మహాసభల్లో లోపాలకు తావు లేకుండా సాంస్కృతిక, పర్యాటక, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఆర్‌అండ్‌బీ, తదితర విభాగాల మధ్య పని విభజన చేశారు. మహాసభల సందర్భంగా 100 పుస్తకాలను ఆవిష్కరించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది.  

10 దేశాలు, 52 మంది ప్రతినిధులు...
ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 10 దేశాల నుంచి 52 మంది అతిథులను ఆహ్వానించగా ఇప్పటి వరకు 34 మంది తమ ఆమోదాన్ని తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ  స్ట్రేలియా, మలేసియా, మారిషస్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయిల్, కువైట్‌ దేశాల నుంచి అతిథులు తరలిరానున్నారు. వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సభలకు రానున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 152 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 557 మంది ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top