
అవార్డులను ప్రదర్శిస్తున్న శౌనక్, తల్లిదండ్రులు
పంజగుట్ట : ఐదేళ్ల బుడతడు తన అద్భుత జ్ఞాపకశక్తితో ఆశ్చర్యపరుస్తున్నాడు. కొండాపూర్‌కు చెందిన మాస్టర్ శౌనక్ శశాంఖ్ ఓఖ్‌డే(5) పిన్నవయసులోనే విశేష ప్రతిభ పాఠవాలతో ‘ఇండియన్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటుదక్కించుకున్నాడు. ఇటీవల జాతీయ స్థాయిలో ‘ఇండియస్ యంగెస్ట్ చైల్డ్ విత్ ఇన్‌క్రిడిబుల్ మెమోరీ పవర్’తో పాటు ‘ఇండియాస్ ఎంగెస్ట్ మల్టీ టాలెంటడ్ చైల్డ్’ అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాలుడి ప్రతిభ గురించి అతని తల్లి శ్రీయ ఓఖ్‌డే, తండ్రి శశాంఖ్ ఓఖ్‌డే ఆసక్తికరమైన అంశాలను వివరించారు. నానక్‌రాంగూడలోని ది శ్రీరామ యూనివర్సల్ స్కూల్‌లో పీపీ–2 చదువుతున్న శౌనక్ చిన్నతనం నుండే అటు చదువులతో పాటు క్రీడలు, ఒక్కసారి విన్న పాటను తిరిగి పాడడం, డైలాగ్‌లు విన్నవెంటనే తిరిగి చెప్పడం చేస్తుండేవాడన్నారు.
అలాగే 196 దేశాల జెండాలు చూపిస్తే వెంటనే ఆ దేశం పేరు చెపుతాడని, ఆరు ఖండాల పేర్లు చెపుతారన్నారు. సైక్లింగ్, స్విమ్మింగ్ స్వయంగా నేర్చుకున్నాడని, కీబోర్డ్ వాయించడంతో పాటు, ఆరో తరగతి పుస్తకాలు కూడా సులువుగా చదువుతాడన్నారు. ఎంతటి లెక్కలైనా సులువుగా చేయడం, ఆంగ్లంలో వెయ్యి వర్డ్స్ స్పెల్లింగ్ చెపుతాడన్నారు.
బాలుడి తల్లి శ్రీయ మాట్లాడుతూ.. తాను గర్భవతిగా ఉన్నప్పుడే పిల్లల మెదడు ఎలా అభివృద్ధి చెందుతుందో టిప్స్ పాటించానన్నారు. బాబుకు ట్యాబ్ గాని, ఫోన్ గాని ఎప్పుడూ ఇవ్వమని, దాని ప్రభావం బ్రెయిన్‌పై పడుతుందన్నారు. అవార్డులు అందుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాలుడి ప్రతిభను అభినందించారన్నారు.