
చిన్నపిల్లలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడతారు. అక్కడ డాక్టర్ తమకు ఇంజెక్షన్ ఇస్తాడేమోనని వణికిపోతారు. మందులు మింగాల్సి వస్తుందని, చేదుగా ఉంటాయని అనుకుంటారు. అయితే ఏడేళ్ల వయసులో డాక్టర్‌గా మారి ఆపరేషన్ చేసిన బాలుడి గురించి మీకు తెలుసా? అతనే అక్రిత్ ప్రాణ్ జస్వాల్.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నూర్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టాడు అక్రిత్. చిన్న వయస్సు నుండే అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతర చిన్నారుల కంటే వేగంగా అన్ని అంశాలను నేర్చుకునేవాడు. రెండేళ్ల వయసులోనే పూర్తిగా చదవడం, రాయడం ప్రారంభించాడు. ఐదేళ్ల వయసులో రావాల్సిన సామర్థ్యం రెండేళ్లకే అతనికి సాధ్యమవడం విశేషం. అనంతరం ఆంగ్ల సాహిత్యం, గణితం (Mathematics) వంటి అంశాలను సాధనం చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లకే ఇంగ్లీష్ క్లాసిక్ పుస్తకాలను చదివాడు.
ఏడేళ్ల వయసులో అక్రిత్ ప్రాణ్ జస్వాల్ (Akrit Pran Jaswal) కీలకమైన విజయం సాధించాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 8 ఏళ్ల బాలిక చేతులపై కాలిన గాయాలతో ఇబ్బంది పడుతుండగా అతను విజయవంతంగా ఆపరేషన్ చేశాడు. అప్పటికే అతను వైద్యరంగానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివి ఉండటం చేత ఆ క్లిష్టమైన శస్త్రచికిత్సను ధైర్యంగా పూర్తి చేశాడు. వైద్యులు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.
చదవండి: ఏం చేశావ్ పెద్దాయనా.. నీకు సెల్యూట్!
ఆ బాలిక గాయాల నుంచి కోలుకోవడంతో అక్రిత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విజయవంతమైన ఆపరేషన్ (Surgery) చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అనేక ఛానెళ్లు అతని ఇంటర్వ్యూ తీసుకున్నాయి. అలా అతని గురించి ప్రపంచానికి తెలిసింది. స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం అక్రిత్ ఐఐటీ కాన్పూర్‌లో చేరాడు. అక్కడ కూడా ప్రతిభ చాటుతూ అందరి ప్రశంసలూ పొందుతున్నాడు.