నింగిలో సయ్యాట

Wings India Aviation Show from 11-03-2020 - Sakshi

అబ్బురపరిచే విన్యాసాలకు సిద్ధం

రేపటి నుంచి ‘వింగ్స్‌ ఇండియా’ఏవియేషన్‌ షో

ముస్తాబైన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌

సనత్‌నగర్‌: నింగిలో అద్భుతానికి హైదరాబాద్‌ నగరం మరోసారి వేదికైంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర పౌర విమానయాన సంస్థ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా రెండేళ్లకోసారి ‘వింగ్స్‌ ఇండియా’పేరిట నిర్వహించే ఏవియేషన్‌ షోకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు ఈ షో జరగనుంది. ఇందులో ప్రధానంగా సరంగ్‌ టీమ్, మార్క్‌ జెఫ్రీ బృందాల విన్యాసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉండనుంది. గతంలో పోలిస్తే ఈసారి ఎయిర్‌ షోకు అధిక ప్రాధాన్యత కల్పించారు. గతంతో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలే విన్యాసాలు జరిగేవి. మార్క్‌ జెఫ్రీ బృందం మాత్రమే విన్యాసాలు చేసేది. ఈసారి అదనంగా సరంగ్‌ టీం కూడా అదరగొట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు సరంగ్‌ టీమ్, మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు మార్క్‌ జెఫ్రీ టీం, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు సరంగ్‌ టీం, సాయంత్రం 4 నుంచి మార్క్‌ జెఫ్రీ బృందం విన్యాసాలు చేయనున్నాయి. ఈ రెండు బృందాలు గత రెండు రోజులుగా రిహార్సల్స్‌ చేస్తున్నాయి.

సకల విమాన ఉత్పత్తుల ప్రదర్శన..
కమర్షియల్, రీజనల్, బిజినెస్, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు హెలికాప్టర్స్, మోటార్‌ గ్‌లైడర్స్, బెలూన్స్‌ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ మిషనరీ, ముడి ఉత్పత్తుల కంపెనీలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంటీరియర్‌ ఉత్పత్తులు, ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ కంపెనీలు, స్పేస్‌ ఇండస్ట్రీలు, డ్రోన్‌ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్‌ సర్వీసెస్, కార్గో ఉత్పత్తులతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు సైతం కొలువుదీరనున్నాయి.

13న సీఎం కేసీఆర్‌ సందర్శన
మొదటిరోజు రిజిస్ట్రేషన్స్, చిన్నచిన్న సమావేశాలు, ఎగ్జిబిషన్‌ ప్రారంభంతో పాటు సరంగ్, మార్క్‌ జెఫ్రీ టీంలు నింగిలో సందడి చేయనున్నాయి. 13న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ షోకు హాజరవుతారు. ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోరలా, ఫిక్కీ చైర్మన్‌ ఆనంద్‌స్టాన్లీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ అర్వింద్‌సింగ్‌ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. 

సామాన్య ప్రజలకు నో ఎంట్రీ..
ప్రతిసారి చివరి రోజున ఏవియేషన్‌ షో వీక్షించేందుకు సామాన్యులకు అవకాశం కల్పించేవారు. అయితే ఈసారి కరోనా ప్రభావంతో సామాన్య ప్రజలను అనుమతించరన్న వార్తలు వస్తున్నాయి. వ్యాపార సంబంధ వ్యక్తులకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top