కూటమిలో రె‘బెల్స్‌’.. పొత్తు చిత్తేనా..?

Will Prefer Fighting Alone Rather Than Begging For Seats In Alliance - Sakshi

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న మహాకూటమి పొత్తు 

మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు 

మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో దిగనున్న టీజేఎస్‌ 

మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ ఇంటి పార్టీ 

దేవరకద్రలో నామినేషన్‌ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ

  మక్తల్‌లో జెడ్పీటీసీ శ్రీహరికి టికెట్‌ ఇప్పించేందుకు డీకే.అరుణ యత్నాలు 

రెండో జాబితాలోనూ ఉమ్మడి జిల్లా మూడు స్థానాలకు దక్కని స్థానం 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :మహాకూటమి పొత్తు లెక్కలు మహా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కూటమిలో భాగంగా ఆయా పార్టీలకు కేటాయిస్తున్న లెక్కలు దారితప్పుతున్నాయి. ముఖ్యంగా తొలి జాబితాలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాలు, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

కూటమిలో భాగంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిగా ఎర్ర శేఖర్‌ను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా అదే స్థానానికి తెలంగాణ జన సమితితో పాటు తెలంగాణ ఇంటి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీజేఎస్‌ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.రాజేందర్‌రెడ్డి పేరును ప్రకటించగా.. తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటిస్తూ జాబితా వెల్లడించింది. అంతేకాకుండా తెలంగాణ ఇంటి పార్టీ జడ్చర్ల అభ్యర్థిగా వి.శివకుమార్, నారాయణపేట అభ్యర్థిగా జనగారి నవిత పేర్ల ను ప్రకటించారు. 

జడ్చర్ల స్థానానికి మహాకూటమి నుంచి కాంగ్రెస్‌ నేత మల్లు రవి పేర్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక దేవరకద్ర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో నిలవాలని భావిస్తుండగా... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మక్తల్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి టికెట్‌ ఇప్పించేందుకు డీకే.అరుణ ఢిల్లీలో యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మహాకూటమి ఉన్నట్లా, విచ్ఛినమైనట్లేనా అనే చర్చ మొదలైంది. 

ఎత్తుకు పైఎత్తు! 
ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహాకూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే విషయంలో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడం కోసం అన్ని రాజకీయపక్షాలు కలిపి మహాకూటమిగా జత కట్టిన విషయం తెలిసిందే. అయితే కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు లెక్కల విషయంలో సయోధ్య కుదరక అన్ని పార్టీలు కూడా సతమతమవుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు.

తాజాగా నోటిఫికేషన్‌ వెలువడి.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ ఎనిమిది, టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీజేఎస్‌ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ నుంచి రాజేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

ఇదిలా ఉంటే మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీకి ఇదివరకే రెండు స్థానాలు కేటాయించగా.. దేవరకద్ర నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా మహాకూటమి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించిన మహబూబ్‌నగర్, జడ్చర్లకు తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం. అంతేకాకుండా ఇంకా మహాకూటమి అభ్యర్థి ఖరారు కాని నారాయణపేట నుంచి ఈ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. 

మక్తల్‌ సీటుపై పీటముడి 
మక్తల్‌ అసెంబ్లీ స్థానం విషయంలో మళ్లీ కొత్త అంశం తెరపైకి వచ్చింది. కూటమి భాగస్వామ్యంలో భాగంగా టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించారు. అందుకు అనుగుణంగా టీడీపీ తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా కె.దయాకర్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ అంత సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

మక్తల్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ బీసీ కోటాలో సిట్టింగ్‌ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి ఇవ్వాలంటూ మాజీ మంత్రి డీకే.అరుణ ఢిల్లీలో అధిష్టానం వద్ద యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్‌ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో పాటు శ్రీహరికి మక్తల్‌లో పట్టు ఉందని కొన్ని సర్వేల నివేదికలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాదు గత ఎన్నికల్లో మక్తల్‌ నుంచి పోటీ చేసిన దయాకర్‌రెడ్డి బీజేపీ మద్దతు ప్రకటించినా మూడో స్థానంలో నిలిచారని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద సీట్ల పంపిణీ కథ మొదటికి వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

వీడని ఉత్కంఠ 
ఓవైపు కూటమి చిచ్చు రగులుతుండగా... మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థుల అంశం ఆ పార్టీ కేడర్‌కు మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు రెండు విడతల్లో భాగంగా విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక రెండు స్థానాలు కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే మరో మూడు స్థానాల విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.

దేవరకద్ర, నారాయణపేట, కొల్లా పూర్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు గ్రూపులుగా ఉన్న డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి ఎవరికి వారు తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేయడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో మరింత జాప్యం జరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top