టీఆర్‌ఎస్‌తో పొత్తు నష్టం ! | Will loss with TRS party merging, says Telangana congress leaders | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో పొత్తు నష్టం !

Mar 14 2014 2:13 AM | Updated on Mar 18 2019 8:51 PM

టీఆర్‌ఎస్‌తో పొత్తు నష్టం ! - Sakshi

టీఆర్‌ఎస్‌తో పొత్తు నష్టం !

తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని, ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులు అవసరం లేదని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జి దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టంచేశారు

దిగ్విజయ్‌కు టీ-కాంగ్రెస్ నేతల నివేదన..  
కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సమక్షంలో టీపీసీసీ ఎన్నికల సంఘం భేటీ

 
 సాక్షి, హైదరాబాద్:  తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని, ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులు అవసరం లేదని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జి దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా సీపీఐ, న్యూడెమొక్రసీలతో పాటు తెలంగాణ పోరాటంలో ముందున్న అన్ని జేఏసీలను కలుపుకొని వెళ్లటం మంచిదని సూచించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తులకు వెళ్తే ఎక్కువ స్థానాలు వదులుకోవలసి వస్తుందని, ఎక్కువమందికి అవకాశాలు రాక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొన్నారు.
 
 గురువారం రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, కేంద్రమంత్రి బలరాంనాయక్ తదతరులు హాజరయ్యారు.
 
  సమావేశంలో ప్రధానంగా పొత్తులపైనే చర్చ సాగింది. పొత్తుల గురించి ఇప్పుడు చర్చవద్దని మరో మూడు రోజులు ఉంటాను కనుక తరువాత మాట్లాడదామని దిగ్విజయ్ ఆ అంశాన్ని పక్కనపెట్టే ప్రయత్నం చేశారు. అయినా పలువురు నేతలు పొత్తులపై తమ అభిప్రాయాలు వినాల్సిందేనని పట్టుపట్టారు. మెజారిటీ నేతలు టీఆర్‌ఎస్‌తో పొత్తులను వ్యతిరేకించారు. కాంగ్రెస్, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నందున టీఆర్‌ఎస్‌తో పొత్తులు లేకుండా వెళ్లడమే మంచిదన్నారు. టీఆర్‌ఎస్ కన్నా తెలంగాణ కోసం స్వచ్ఛందంగా పోరాడిన విద్యార్థి, ఉద్యోగ, టీచ ర్స్, అడ్వొకేట్ ఇలా అన్ని జేఏసీల వారికి అవకాశమివ్వటం మంచిదని సూచించారు.
 
  సీపీఐ, న్యూడెమొక్రసీ వంటి పార్టీలను కలుపుకొని వెళ్లవచ్చని, తెలంగాణలో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. పొత్తులపై టీఆర్‌ఎస్ ప్రతిపాదనలు ఇస్తే అదీ కాంగ్రెస్‌కు నష్టం లేకుండా ఉంటేనే పరిశీలనకు తీసుకోవాలని, లేనిపక్షంలో సొంత పార్టీ వారికి అన్యాయం జరుగుతుందని వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు స్పష్టంచేశారు. అయితే.. దీనిపై దిగ్విజయ్ స్పష్టత ఇవ్వకుండా రేపో, ఎల్లుండో పొత్తులపై చెప్తామని వారితో పేర్కొన్నారు. పొత్తులపై అందరితో చర్చించాక పార్టీ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
 
 అభ్యర్థులపై జిల్లా కమిటీల నివేదికలు పక్కనపెట్టాలి
 పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై కూడా అనేకమంది దిగ్విజయ్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన నివేదికలు తప్పులు తడకగా ఉన్నాయని కమిటీ సభ్యులు నిరసన వ్యక్తపరిచారు. అసమర్థులను, తమకు సన్నిహితులు అనుకొనే వారి పేర్లు చేర్చారని, ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకోరాదని సూచించారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక తానుచేయనని, నివేదికలు, వినతిపత్రాలు తీసుకొని పార్టీ అధిష్టానానికి, కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అప్పగించటం వరకే తన బాధ్యత అని దిగ్విజయ్ వివరించారు. 22న రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుందని, ఈ కమిటీ చర్చించాక వయలార్ రవి నేతృత్వంలోని జాతీయ స్క్రీనింగ్ కమిటీకి నివేదిస్తుందన్నారు. జాతీయ కమిటీ  28న భేటీ అయి తుది జాబితా ప్రకటిస్తుందని తెలిపారు.
 
 ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయాలి...
 కాంగ్రెస్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలందరికీ టిక్కెట్లు ఖరారుచేయాలని పలువురు నేతలు పేర్కొన్నారు. కొంతమంది దీనికి అభ్యంతరం తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును అంచనావేయాలని, తెలంగాణ ఉద్యమంలో వారి భాగస్వామ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాకనే టిక్కెట్లు ఇవ్వాలని చెప్పారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి అప్పటికప్పుడే టిక్కెట్లు పొందాలని ప్రయత్నిస్తున్న వారికి అవకాశం ఇవ్వరాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని స్థానికులకే కేటాయించాలని ఆ జిల్లాకు చెందిన నేతలు స్పష్టంచేశారు.
 
 సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించాలి...
 దళితులు, బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేయటంతో తెలంగాణలో అత్యధిక శాతమున్న ఆ వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణకు సీఎం అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని దానం నాగేందర్ తదితరులు సూచించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా హైదరాబాద్‌లోని సిట్టింగ్ స్థానాలన్నిటినీ గెలిపించుకొనే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచందర్ దిగ్విజయ్‌ను కోరారు. మహిళలకు 20 నుంచి 30 శాతం స్థానాలు వచ్చేలా చూడాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత కోరారు.
 
 రెండు చోట్ల సోనియా సభలు...
 తెలంగాణను ఏర్పాటు చేసినందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు.
 
 రేణుకపై పొన్నం ఫైర్: సమావేశంలో ఎంపీ రేణుకాచౌదరిపై మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆమెను ఇక్కడి కమిటీలో వేయడం తెలంగాణకే అవమానకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆమె అనేక ప్రకటనలు చేసి అవమానించారని, ఉద్యమకారులపై కేసులు పెట్టించి వే ధించారని ఆమెను తెలంగాణ వ్యక్తిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఖమ్మం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని కొంతమంది అడిగితే.. ఆయన పుట్టిన స్థలం ఎక్కడని రేణుక తన అనుయాయులతో ప్రశ్నలు వేయించారని దుయ్యబట్టారు.
 
 ఆమెను కమిటీ నుంచి తప్పిం చాలని పట్టుపట్టారు. దిగ్విజయ్ కలుగచేసుకుంటూ వివాదాలు వద్దని, అన్ని విషయాలూ తనకు తెలుసని సర్దిచెప్పారు. గాంధీభవన్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, అల్లుఅరవింద్ వియ్యంకుడు కంచర్ల శేఖర్‌రెడ్డిల మధ్య వివాదం చోటుచేసుకుంది. చిర ంజీవి అండచూసుకొని రెచ్చిపోవద్దని మల్‌రెడ్డి అనటంతో నీకేం బలముందని శేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.
 
 జైపాల్, షబ్బీర్ నివాసాలకు దిగ్విజయ్
 హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ మధ్యాహ్నం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి దాదాపు గంటసేపు ఉన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు. సాయంత్రం షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. ఇదిలాఉంటే.. సీమాంధ్ర ఎన్నికల కమిటీలో ఎంపీ సుబ్బరామిరెడ్డిని నియమిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురువారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement