బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్లకు కేంద్రంపై ఒత్తిడి

will fight for BC reservation in promotions says Jogu Ramanna - Sakshi

బీసీల ఆర్థిక చేయూతకు బిక్కి సంస్థ ఏర్పాటు: మంత్రి జోగు  

సాక్షి, హైదరాబాద్‌: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే అఖిలపక్ష పార్టీలను ఢిల్లీ తీసుకెళ్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బీసీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు కల్పిస్తామని హామీనిచ్చారు. బీసీలకు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి బిక్కి అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. క్రీమీలేయర్‌ను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో బీసీ కమిషన్‌ బిల్లు ఆమోదించి చట్టం తీసుకొస్తామని మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో వచ్చే నెలలో కేంద్రమంత్రితో సమావేశమవుతానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములు, సభ్యులు కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top