ఎన్జీటీపై సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదు?

వివరణ ఇవ్వాలని సర్కార్‌ను కోరిన హైకోర్టు

విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలని ఆదేశిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉందని, అయితే, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులోనే అప్పీల్‌ చేయాలని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదో తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం తెలంగాణ సర్కార్‌ను వివరణ కోరింది.

ఎన్జీటీ మధ్యంతర ఆదేశాల్ని తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసిన వ్యాజ్యాలని  మంగళవారం ధర్మాసనం విచారించింది. తొలుత ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. తీర్పు పూర్తి కాపీ సిద్ధమయ్యాక కోర్టులో ప్రకటించాలని, అయితే తీర్పు ప్రతి పూర్తికాకుండానే ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందున దానిని కొట్టేయాలని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను  బుధవారానికి వాయిదా వేసింది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top