పవర్ హాలిడే ఉంటే ఎవరొస్తారు? | who will come to investment in telangana industries ? | Sakshi
Sakshi News home page

పవర్ హాలిడే ఉంటే ఎవరొస్తారు?

Nov 29 2014 1:07 AM | Updated on Sep 2 2017 5:17 PM

తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడే కొనసాగితే భవిష్యత్‌లో ప్రభుత్వం సప్తరంగుల కార్పెట్ పరిచినా..

మండలిలో ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్   
విద్యుత్ రాయితీలపై స్పష్టత ఉండాలి: షబ్బీర్
 పారిశ్రామికవాడల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకూ కోటా: మంత్రి కేటీఆర్
 రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం బిల్లుకు మండలి ఆమోదం

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడే కొనసాగితే భవిష్యత్‌లో ప్రభుత్వం సప్తరంగుల కార్పెట్ పరిచినా పారిశ్రామికవేత్తలెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానం బిల్లుపై శుక్రవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ రేయాన్స్‌తోపాటు పలు మూతపడిన పరిశ్రమలను తెరిపించే విధానాలకు కూడా కొత్త బిల్లులో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు కేటాయించే భూమిలో బీసీలు, మైనార్టీలు, స్థానికులకు వెయిటేజీ ఇచ్చి ప్లాట్లు, భూములు కేటాయించాలని కోరారు.
 
 విద్యుత్ రాయితీలు ఇచ్చే విషయమై బిల్లులో స్పష్టత ఉండాలని సూచించారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన పారిశ్రామిక విధానంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలన్నారు. టీడీపీ సభ్యుడు నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ, అటవీ అనుమతుల మంజూరుపై బిల్లులో స్పష్టత ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. పారిశ్రామిక వేత్తలకు కేటాయించే భూమిని ఈక్విటీ రూపంలో పరిగణించాలన్న సలహాను బిల్లులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విధిగా కోటా ఉంటుందన్నారు. స్థానికులకు కూడా కోటా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం మండలి మూజువాణి ఓటుతో పారిశ్రామిక విధానం బిల్లుకు ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement