ఎక్కడ చూసినా మందు, విందు భోజనాలే..  

 Where do you see the food, dinner lunch .. - Sakshi

ద్వితీయశ్రేణి నాయకులకు తాయిలాల వల 

పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు, మద్యం

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ 

సాక్షి, వనపర్తి క్రైం: ఎన్నికలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో పడ్డారు. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తూనే మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. ప్రచారం గడువు దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు డబ్బు, మద్యం ముట్టజెప్పి తమ ప్రజాబలాన్ని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీ వెంట వస్తే మాకేంటని నాయకులు, కార్యకర్తలు పోటీదారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్కడ ఓట్లు జారిపోతాయోననే భయంతో అభ్యర్థులు వారి డిమాండ్లను కాదనకుండా ఒప్పుకుంటున్నారు. డబ్బు, మద్యం, విందు భోజనాలు.. ఇలా ఏది కోరితే అది ఏర్పాటుచేస్తూ డబ్బులు అధికంగా వెచ్చిస్తున్నారు.  

ప్రచారంలో డబ్బుతోనే పని..  
ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లకు నోట్ల పండగే. నీకే ఓటేస్తాం.. ఎంతిస్తారంటూ నిర్మోహమాటంగా అడిగేస్తున్నారు. రోజంతా నీతోనే తిరిగాం.. గొంతుతడపరేం అంటూ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ప్రచార సమయాల్లో జనబలాన్ని చూపేందుకు ధనబలాన్ని వదులుకోకతప్పడం లేదు.

గ్రామాల్లో ముఖ్యనాయకులకు డబ్బు అవసరం పడితే అభ్యర్థుల పర్సనల్‌ ఇన్‌చార్జ్‌లను సంప్రదించి, రహస్యంగా డబ్బును చేజిక్కుంచుకుని ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.   

కిక్కు తప్పనిసరి..  
గ్రామాలు, మండలాల్లో ప్రచారం నిర్వహించే నాయకులు మద్యం కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. జన బలం కోసం నాయకులు ముందుగానే సరుకు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎందుకంటే వారి వెంట వచ్చే చోటామోట నాయకులు ఎన్నికల తంతు ముగిసేవరకు పనిచేస్తారని భావిస్తున్నారు. దీంతో గ్రామాల వారీగా మద్యం పంపిణీకి ముఖ్యనాయకులు చీటీలు అందజేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలను ఆబ్కారీ శాఖ నియంత్రించినా గుట్టుగా మద్యం సరఫరా అవుతోంది.   

భోజనాలు, బిర్యానీలు.. 
నిత్యం ప్రచారాలు చేస్తుండటం, ప్రచార సామగ్రిని సమకూర్చుతూ నాయకులు వారి అనుచరులకు ఎక్కడికక్కడే హోటళ్లలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల హోటళ్లలో దాబాలను తలపించేలా బిర్యానీలు, కూరలు కోరుకుంటున్నారు. భారీ సభలు, కార్యక్రమాలు ఉన్న సమయంలో ఒకరోజు ముందుగానే కోరుకున్న వంటలకు ఆర్డర్లు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారు.

ఈ బిల్లులన్నీ అభ్యర్థులు భరిస్తుండటంతో ఖర్చు తడిపిమోపెడవుతోంది. ర్యాలీలు విజయవంతం కావాలన్నా, భారీగా జనం చూపించాలన్నా.. వారి వెంట జనం కనిపించాలి. అందుకు పనులకు వెళ్లే కూలీలను ర్యాలీలకు తరలించేందుకు రేటు మాట్లాడుకుంటున్నారు.  

 
మద్యం పంపిణీపై నజర్‌ 
ఓటర్లకు ఎరవేసే మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద వాహనాల తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. జిల్లాలో 8 చెక్‌పోస్టులు, 6 ఫ్లయింగ్‌ స్వా్కడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

గ్రామపోలీస్‌ అధికారితో పాటు స్పెషల్‌బ్రాంచ్, ఇంటలిజెన్స్‌ పోలీసులు గ్రామాల్లో జరిగే కార్యక్రమాలపై ప్రత్యేకనిఘా ఉంచారు. మద్యం, డబ్బులు పంపిణీపై నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తూ వాటిని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు రూ.42లక్షల నగదు, ఏడువేల లీటర్ల మ ద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నెల 25న పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజీ సమీపంలోని జేఎం పారమ్స్‌లో అక్రమంగా నిల్వఉంచిన రూ.20లక్షలు విలువచేసే 699 కాటన్లలో 33,552 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వనపర్తి డీఎస్పీ తన సిబ్బందితో అక్రమ డంప్‌పై దాడిచేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు.  

6 బృందాలతో నిరంతర నిఘా 
మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. వీటిపై ఆరు బృందాలు నిరంతరం నిఘా ఉంచాయి. ఎలాంటి ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
 – అపూర్వరావు, ఎస్పీ, వనపర్తి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top