రూ.100 కోట్ల అభివృద్ధి డిజైన్లకే పరిమితం  

When Will The Ramalayam Development Works Begin? - Sakshi

రెండేళ్లుగా కసరత్తుతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వం

ఆచరణలో అడుగు ముందుకు పడని వైనం

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆలయ అభివృద్ధిపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. కానీ కార్యరూపం దాల్చడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రగిరి వైపు కన్నెత్తి చూడకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఆలయ పునర్‌ నిర్మాణ పనులకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని, ఎంత ఖర్చు చేసైనా సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డిజైన్ల పరిశీలన, మార్పులు చేర్పులతోనే సరిపుచ్చుతున్నారు. రానున్నది ఎన్నికల సీజన్‌ కావటంతో భద్రాద్రి ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇప్పట్లో జరిగేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  

అంతా  హంగామే.. 

రూ.100కోట్ల ప్రకటన, రెండేళ్లుగా రూపొందిస్తున్న డిజైన్ల హంగామా చూస్తుంటే ఆలయాభివృద్ధి పనులు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా తరలివెళ్లి మొక్కులు సమర్పించటం చర్చకుదారితీసింది. ఆధ్యాత్మిక చింతన గల సీఎం భద్రాచలం రాములోరి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ గళాన్ని ఎక్కుపెడుతున్నారు. రాములోరి క్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు.  

భక్తుల కానుకలతోనే.. 

భక్తులు ఇచ్చిన కానుకులతోనే ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి వస్తోంది. ఏడాదికి అన్ని రకాలుగా సుమారు రూ.35 కోట్ల మేర ఆలయానికి ఆదాయం వస్తోంది. గతంలో ఏడాదికి రూ.30 కోట్లు లోపే ఆదాయం ఉండేది. కానీ ఇటీవల కాలంలో హుండీల ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయంలో సింహభాగం వైదిక, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది.

మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని ఫిక్సిడ్‌ డిపాజిట్‌లు చేస్తున్నారు. ప్రతీ ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణ ఆలయానికి అదనపు భారమే అవుతోంది. రాష్ట్ర ఉత్సవాలైనప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదు. నిర్వహణ ఖర్చులను దేవస్థానమే భరించాల్సివస్తోంది.

 దీంతో ఆలయ కార్యకలపాల నిర్వహణకే తప్ప భక్తుల వసతుల కోసం శాశ్వత నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కొందరు దాతలు సత్రాలు నిర్మిస్తున్నా.. పెద్దగా పురోగతి లేదు. దేవస్థానం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో మౌలిక వసతులపై దృష్టి సారించలేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు.  

చిల్లిగవ్వ లేదు 

భద్రాద్రి ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క నయాపైసా కూడా విడుదల చేయలేదు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో రూ. 9.50 కోట్లు మంజూరు చేశారు. వాటితో మాడవీధుల విస్తరణ, కల్యాణ మండపం అభివృద్ధి వంటి పనులు చేశారు.

మాడవీధుల విస్తరణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో తలెత్తిన కోర్టు కేసుల వివాదంతో ఆ పనులను ఇప్పటి వరకూ కూడా పూర్తి చేయలేదు. స్వరాష్ట్రంలో కూడా భద్రాద్రి ఆలయాభివృద్ధికి ఇప్పటి వరకూ ఎటువంటి నిధులు విడుదల చేయకపోవటంపై ఈ ప్రాంత వాసుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

పాలక మండలి ఊసేది.?  

రాష్ట్రంలో కీలక ఆలయాలకు పాలక మండళ్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రామాలయానికి, పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. ఆలయాభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేస్తున్నందున ట్రస్టు బోర్డు స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అది కూడా ఆచరణకు నోచుకులేదు. ట్రస్టు బోర్డు ఉంటే ఆలయాభివృద్ధికి నిధుల సమీకరణపై దృష్టిసారించే అవకాశం ఉండేది.

ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చే వారు. భద్రాద్రి విషయంలో ప్రభుత్వం కాలయాపనే చేస్తుంది తప్ప, చిత్తశుద్ధి చూపించటం లేదనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండటంపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వచ్చేది ఎన్నికల సీజన్‌ కావటంతో అభివృద్ధి పనులకు శిలాఫలకం పడుతుందా..? లేదా డిజైన్‌లతో సరిపుచ్చుతారా..? లేక భద్రాద్రి విషయంలో ఇక్కడి ప్రజానీకం ఊహించనిదేమైనా జరుగుతుందా అనేదానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top