
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాల్లో దళితులపై పోలీసులు దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ జిల్లా ఎస్పీ, సస్పెండైన ఎస్సైలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నేరెళ్ల మరో 2 గ్రామాల్లోని దళితుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని, విచక్షణారహితంగా కొట్టారని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఇదే అంశంపై హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చంద్రకుమార్ రాసిన లేఖనూ పిల్‌గా పరిగణించి.. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎస్పీ, సస్పెన్షన్‌కు గురైన ఎస్సైలు తమ వాదనలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని వారి న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దాంతో విచారణ వారం రోజులపాటు వాయిదా పడింది.