అక్నాపూర్‌లో వింత.. ఎండిన బావుల్లో..

Wells Are Filling With Water In Summer In Nawabpet - Sakshi

ఆశ్చర్యానికి గురవుతున్న గ్రామస్తులు

వందలాది ఫీట్ల లోతున్న బోరుబావులు ఎండిపోతున్న ప్రస్తుత తరుణంలో.. కేవలం 10 గజాల లోతున్న పాత బావుల నుంచి నీళ్లు పైపైకి వస్తున్నాయి. ఇది చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడో ఎండిపోయిన బావుల్లో మూడు గజాల మేర ఎగిసివచ్చిన నీటిని చూసి రైతులు విస్తుపోతున్నారు.  – నవాబుపేట

నవాబుపేట: మండల పరిధిలోని అక్నాపూర్‌లో వింత చోటు చేసుకుంది. గ్రామంలోని కొన్ని పాడుపడ్డ వ్యవసాయ బావుల్లో ప్రస్తుతం నీళ్లు ఊరుతున్నాయి. స్థానికుడు చాకలి పెంటయ్య వ్యవసాయ పొలం వద్ద గత కొన్నేళ్ల క్రితం చెలిమె(మాసబావి) ఉండేది. దీనిలో ఎప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉండేవి. గతంలో గ్రామస్తులంతా ఈ బావిలోని నీళ్లను తీసుకెళ్లి తాగేవారంట. కాలక్రమేణ 10 ఏళ్ల క్రితం అది పూర్తిగా కూడిపోయి.. నీళ్లు రావడం ఆగిపోయింది. ఉన్నట్లుండి వారం రోజులుగా తిరిగి ఆ చెలిమెలో(మాసబావిలో) నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇది గమనించిన పలువురు రైతులు విషయాన్ని స్థానికులకు చెప్పారు. అడుగంటిన బావినుంచి మండుటెండల్లో మళ్లీ నీళ్లు రావడం ఏమిటని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.  

మూడు గజాల మేర నీళ్లు..
గతంలో మూడు కాలలపాటు ఈ బావిలో నీళ్లు ఉండేవి. తిరిగి మళ్లీ చాలా రోజుల అనంతరం నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు, పొలం యజమానులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన చెందిపె బాలకృష్ణ, హరిజన్‌ పాపయ్యలకు చెందిన బావుల్లో సైతం నీళ్లు లేక గత కొంత కాలంగా నిరుపయోగంగా మారాయి. వీటిలో నీళ్లు లేవని రైతులు పట్టించుకోవడం లేనేశారు. దీంతో అవి కేవలం పాడుపడ్డ బావులుగా మిగిలిపోయాయి. వారం రోజులుగా ఆ బావుల్లో నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం వీటిలో మూడు గజాల నీళ్లు చేరాయి.
అలాగే వీటికి దగ్గరలోని పూలపల్లికి చెందిన తూర్పాటి అంజయ్య పొలం వద్ద చాలా రోజుల క్రితం తవ్విన వ్యవసాయ బావి ఉంది. ఇందులోకి సైతం నీళ్లు లేకపోవడంతో పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆ బావినిరుపయోగంగా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ మంచి ఎండాకాలంలో బావుల్లో మూడు గజాల నీళ్లు వచ్చాయి. ఏనాడో ఎండిపోయిన బావుల్లో ఇప్పుడు నీళ్లు ఎలా వస్తున్నాయో తెలియక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.   

వేసవిలో నీళ్లొస్తున్నాయి
మా పొలం వద్ద గతంలో చెలిమె(మాసబావి) ఉండేది. కొద్ది కొద్దిగా బావి మొత్తం కూడుకపోయింది. చెలిమెలో నీళ్లు కూడా రాలేదు. గతంలో ఈ చెలిమె నుంచి నీళ్లు బాగా వచ్చేవని, గ్రామస్తులు సైతం తాగడానికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకపోయే వారని మా తాతలు చెప్పేవారు. చాలా రోజులు క్రితం నీళ్లు రావడం బందైంది. మళ్లీ వేసవిలో నీళ్లు రావడం ఆశ్చర్యంగా ఉంది.   
– చాకలి పెంటయ్య, రైతు, అక్నాపూర్‌

వర్షాకాలంలో మాత్రం ఉండేవి
మా బావి 10 గజాల లోతు ఉంది. అందులో కేవలం వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఉండేవి. దీనివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో దాన్ని మరిచి పోయాము. ప్రతీసారి సంక్రాంతి పండుగవరకు బావిలో వర్షం నీళ్లు ఉంటుండే. తర్వాత బావి ఎండిపోతుండే. కానీ ఆ సారి మాత్రం ఇప్పుడు మూడు గజాల వరకు నీళ్లు వచ్చాయి. ఈ సమయంలో ఎప్పుడూ నీళ్లుండేది కాదు.  
 – తూర్పాటి అంజయ్య, రైతు పూలపల్లి  

ఆశ్చర్యంగా ఉంది
మా బోరు నడపడం ఆపితే ఆ బావుల్లో నీళ్లు తగ్గుతున్నాయి. మా బోరు ఎప్పుడు నడుస్తుంటేనే ఆ బావుల్లో నీళ్లు పెరుగుతున్నాయి. నేను చాలా సార్లు గమనించాను. తూర్పాటి అంజయ్య... హరిజన్‌  పాపయ్య పొలాల మధ్యన మా పొలం ఉంది. కానీ ఎప్పుడు లేని బావుల్లో నీళ్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. సరైన వర్షాలు లేకపోవడంతో ఇది వింతగానే కనిపిస్తోంది.
– నర్సింగ్‌రావ్, అక్నాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top