ఆబ్కారీ చేతిలో ఆయుధం


ఖమ్మం క్రైం :  ఎక్సైజ్ సిబ్బంది చేతికి ఇక ఆయుధాలు రాబోతున్నాయి. సాయుధ పోలీసు దళంలో వీరూ చేరబోతున్నారు. గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు అప్పగించే కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి పద్మారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో సిబ్బందికి ఆయుధాలు అవసరముంటాయో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు.



 ఎందుకు ఇలా..?

 జిల్లాలో గుడుంబా తయారీ ఎక్కువగా ఉండడం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తుండడం తెలిసిందే. వీటిని అరికట్టడానికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై దాడులు జరిగాయి. చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఈ దాడులను ఎదుర్కొలేక ఇబ్బందు లు పడుతున్నారు. గాయాలకు గురై ఆస్పత్రుల్లో చేరిన సందర్భాలూ ఉన్నాయి. గుడుంబా తయారీదారులు, గంజాయి సాగుదారుల దాడులను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.



ఒక వైపు శాంతిభద్రతల విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొనడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీస్ శాఖపై ఆధార పడకుండా ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అది అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించింది.

 

సమస్యాత్మక ప్రాంతాల్లోనే...

 జిల్లాలో గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్లు దాడులు చేసే అవకాశముందో ఆ సిబ్బంది సంఖ్య గురించి నివేదిక పంపించాలని భావిస్తున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులతో పాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.



 ఎవరెవరికి...

 జిల్లాలో ఒక డిప్యూటీ కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు ఈఎస్‌లు, ముగ్గురు ఏఈఎస్‌లు, 19 మంది సీఐలు, 42 మంది ఎస్సైలు, 38 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 194 మంది కానిస్టేబుళ్లు ఆయుధాలు చేపట్టే  అవకాశం ఉంది. వీరిలో అధికారుల వరకు 9 పాయింట్ 38 రివాల్వర్లు మిగతా సిబ్బందికి 303 తుపాకులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే వీరిలో కొద్దిమంది సీఐలు, ఎస్సైలు, జూనియర్ అసిస్టెంట్ల స్థాయి నుంచి పదోన్నతిపై రావడంతో వారికి వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేదు.



మిగతా వారు ఎక్సైజ్ ఎస్సై స్థాయి నుంచి రావడంతో వారికి శిక్షణలో భాగంగానే ఎక్సైజ్ అకాడమీలో వెపన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేనివారి గురించి వివరాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు తయారు చేస్తున్నారు. ఈ సిబ్బందిలో ఎంత మందికి ఆయుధాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top